టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శంకర్ పల్లి సమీపంలోని నందమూరి తారకరత్న ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. తర్వాత తారకరత్న చిత్ర పటానికి పూలు సమర్పించి, నమస్కరించారు. తారకరత్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరామర్శించారు.


ఆ తర్వాత అక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును పలకరించారు. కాసేపు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. విజయసాయి రెడ్డి తరచూ చంద్రబాబు లక్ష్యంగా పరుష పదజాలంతో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసే సంగతి సంగతి తెలిసిందే. 


అనంతరం విజయసాయి రెడ్డితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక మంచి భవిష్యత్‌ ఉన్న వ్యక్తిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన చెందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని కూడా తనతో చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ అవకాశం కూడా ఇద్దామనుకున్నామని, దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని తనతో చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ లోపే తారకరత్న చనిపోవడం బాధాకరమని అన్నారు. 


‘‘ఈనెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు నిండుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. అమరావతి అనే సినిమాలో నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయింది. చిన్న వయసులో ఏ ఆశయాల కోసం తారకరత్న పని చేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు పని చేయాలని అనుకుంటున్నా. 


తారకరత్నకు ముగ్గురు పిల్లలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. మేం వారికి ఎప్పుడూ అండగానే ఉంటాం. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డితో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.


విజయసాయిరెడ్డి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి తరపు బంధువు. తారకరత్న ఆస్పత్రిలో చేరిననాటి నుంచి విజయసాయిరెడ్డి కూడా ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తారకరత్నను చేర్పించిన బెంగళూరులోని నారాయణ ఆస్పత్రికి వెళ్లి కూడా పరామర్శించి వచ్చారు.


తారకరత్నకు ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు
మోకిలలోని సొంతింట్లో ఉన్న తారకరత్న భౌతికకాయం వద్దకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగివస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలచిందని వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు.


తారకరత్న భౌతికకాయానికి కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ నివాళి
సినీ నటుడు తారకరత్న భౌతిక కాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ నివాళి అర్పించారు. మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న వారు పార్థివ దేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో ఎన్టీఆర్ మాట్లాడారు.