మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు (ఆగస్టు 23) హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు అయ్యారు. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ప్రమోషన్, నాలెడ్జ్ ఎకానమీ అంశాలపై చంద్రబాబు తన ఆలోచనలను, గతంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998లో ఐఐఐటీ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఛైర్మన్ రాజ్ రెడ్డితో చంద్రబాబు సంభాషణ జరిగింది. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం తనకు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశం అని అన్నారు. అభివృద్ధి చేయడం వేరు, ఎన్నికల్లో గెలవడం వేరని అభిప్రాయపడ్డారు. విజన్ తో పని చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఫలితాలకు నేటి హైదరాబాదే సాక్ష్యమని అన్నారు. స్మార్ట్ సిటీలతో పాటు.. స్మార్ట్ విలేజ్‌లు కూడా రావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ చెప్పిన విషయాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దేశ రాజధానికి ఢిల్లీకి దీటుగా హైదరాబాద్ చేసేలా ఉన్నావని ఆనాడు వాజ్ పేయీ అన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ లాంటివి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చంద్రబాబు అభివర్ణించారు. సాధారణ ఇంజినీరింగ్ కాలేజీల్లాంటివి ఇవి కావని, పాతిక సంవత్సరాల క్రితమే విజన్‌తో ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని వివరించారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటైన కొత్తలో తనను ఛాన్స్‌లర్ గా ఉండమని కోరారని, నేను వీసీగా ఉంటానన్నారని రాజ్ రెడ్డి అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే, అందుకు తాను తిరస్కరించానని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు రాజకీయ నాయకులు ఛాన్స్‌లర్ గా ఉంటే, పదవి నుంచి పోయాక ఇంకో రాజకీయ నాయకుడు ఛాన్స్‌లర్ అవుతారని అన్నారు. అలాంటి సమయంలో కొంత మంది రాజకీయ నాయకుల వల్ల విద్యాసంస్థ ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని అన్నారు. 25 ఏళ్లుగా రాజ్ రెడ్డి ఛాన్స్‌లర్ గా ఉండడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సంస్థ ప్రతిష్ఠ మరింత పెరిగిందని అన్నారు.