Chandrasekhar Joins Congress Party:


తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈనెల 12వ తేదీన బీజేపీకి రాజీనామా చేసిన చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరాలని భావించారు. ఇదివరకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడింది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనివార్య కారణాలతో కొన్ని రోజుల కిందట చంద్రశేఖర్ చేరిక వాయిదా పడింది. 2021లో బీజేపీలో చేరిన ఆయన తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని అసహనంగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, తాను పార్టీలో కొననసాగలేనని చెప్పారు. 


ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ చేరిక ఆలస్యం కావడంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలు భావించారు. గాంధీ భవన్‌లో బుధవారం జరిగే కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం పార్టీలో ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో చేవెళ్ల లేదా జహీరాబాద్‌ నుంచి ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన మాత్రం జహీరాబాద్‌ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.  గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం.


సీనియన్ నేత చంద్రశేఖర్ గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో పనిచేశారు. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి అసెంబ్లీకి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. ప్రాధాన్యం దక్కడం లేదని, అక్కడ ఉండలేనంటూ బీజేపీ పార్టీని వీడి బయటకు వచ్చేశారు. నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.


ఈటల రాజేందర్ సహా మరికొందరు నేతలు మాజీ మంత్రి చంద్రశేఖర్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆయన మనసు మార్చుకోలేదు. రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి బండి సంజయ్ ను తప్పించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం లాంటి భారీ మార్పులు జరిగాయి. మరోవైపు బీజేపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్  పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.  వికారాబాద్‌లో 2021 జనవరి 18న నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సమక్షంలో చంద్రశేఖర్‌ బీజేపీలో చేరారు. 


చంద్రశేఖర్‌కు సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లో ముఖ్య నేతల హామీ ఇచ్చారు. అయితే తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తన తరువాత పార్టీలో చేరిన వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. బీజేపీలో ప్రాధాన్యం ఉండేలా బాధ్యతలు అప్పగిస్తామని గతంలో బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయనే పదవిలో లేకపోవడంతో చంద్రశేఖర్‌ ఆశలు సన్నగిల్లి పార్టీకి గుడ్ బై చెప్పారు.