Chandrababu In ISB : 20 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించిందని చంద్రబాబు అన్నారు. ఐఎస్‌బీ హైదరాబాద్ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు చేసేందుకు ఆయన చేసిన కృషిని వివరించారు. విజన్ 2020 అన్నప్పుడు కొందరు 420 అని ఎగతాళి చేశారు. నేడు ఆ కల సాకారమైందన్నారు. విజన్ 2020తో ప్రారంభించిన వ్యవస్థలు ఇప్పుడు ఉజ్వలంగా ఉన్నాయి. 11 ఏళ్ల క్రితం నాటిన చెట్టులా ఐఎస్‌బీ కూడా వృద్ధి చెందిందన్నారు. 20ఏళ్ల క్రితం ఇక్కడ సెంట్రల్ వర్సిటీ ఒక్కటే ఉండేదని.. తర్వాత ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎంతో శ్రమించామన్నారు.
ఐటీ కంపెనీల కోసం అమెరికా వెళ్లి ప్రయత్నం
అమెరికా వెళ్లి అనేకమంది అగ్రశ్రేణి ఐటీ కంపెనీల సీఈవోలను కలిశామని.. మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని అప్పట్లో బతిమాలుకున్నామని గుర్తు చేశారు. . 10 నిమిషాలు అపాయింట్‌మెంట్ కోరి 45 నిమిషాల పాటు ఆయనకు వివరించామన్నారు. ఒక్క మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే దానివెనుక అనేక సంస్థలు వస్తాయని కృషి చేశామన్నారు. ఎంతో శ్రమించాక హైదరాబాద్‌లో ఐఎస్‌బీ పెట్టాలన్న కల సాకారమైందన్నారు. మైక్రోసాఫ్ట్ వచ్చాకే హైదరాబాద్‌లో ఐటీ విప్లవం ఊపందుకుంది. ఐటీ, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించింది. బయోటెక్నాలజీలో జినోమ్ వ్యాలీ కొత్త విప్లవం సృష్టించిందన్నారు 162 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ హైదరాబాద్‌కు మణిహారం. ఓఆర్‌ఆర్ పక్కన వచ్చిన పచ్చదనం హైదరాబాద్‌కు గ్రీన్‌సిటీ అవార్డు తెచ్చిందన్నారు.
ఇప్పుడు డెమొగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉందన్న చంద్రబాబు
ఇప్పుడు డెమొగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉందని ఐఎస్‌బీ విద్యార్థులకు చంద్రబాబు చెప్పారు. యూరప్, జపాన్ లాంటి దేశాలు వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నాయి. ఇప్పుడు భారత్‌కు ఉన్న అడ్వాంటేజ్ యువత. వారిని అవకాశాలుగా మలచుకోవాలని పారిశ్రామికవేత్తలకుసూచించారు. దేశంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రజల్లో తెలుగువారే అధికశాతం. 2047 నాటికి భారతీయులు అధిక తలసరి ఆదాయం ఉన్నవారిగా మారతారు. 2047 నాటికి 1, 2, 3 స్థానాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి బలమైన శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కృషిని గుర్తుచేసుకున్న డీన్
ఐఎస్‌బీ ఎందరో నాయకులను తయారు చేసిందని ఐఎస్‌బీ డీల్ మదన్ పిల్లుట్ల అన్నారు. ప్రభుత్వాలతో కలిసి అనేక నైపుణ్య కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. చంద్రబాబుతో తమకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఎంతో విజన్ ఉన్న నేత చంద్రబాబు అని ఐఎస్‌బీ అధికారులు పేర్కొన్నారు. చంద్రబాబు తీర్చిదిద్దిన సంస్థ అని, ఐఎస్‌బీ పురోగతి కోసం చంద్రబాబు అపార కృషి చేశారని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు తలమానికం ఐఎస్‌బీ అని, ఐఎస్‌బీలో పరిశోధనలకు పెద్దపీట వేశామని డీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్‌బీ పేరు గడించిందని, ఐఎస్‌బీ విద్యార్థులు వివిధ దేశాల్లో రాణిస్తున్నారని, కీలక సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని డీన్ మదన్ వెల్లడించారు.