Pastor Ajay: ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ అజయ్‌ను తుకారాం గేట్ పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన ఉద్రిక్తలు చెలరేగేలా మాట్లాడరన్న ఫిర్యాదులు రావడంతో 196, 352, 352, 299 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం పాస్టర్ అజయ్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సోమవారం సాయింత్రం నాలుగు గంటలకు జడ్జి వద్ద పోలీసులు పాస్టర్ అజయ్‌ను ప్రవేశపెట్టారు. కేసు వివరాలను తెలుసుకున్న న్యాయమూర్తి ఏడు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు. ఆయన్ని పోలీసులు చంచల్‌గూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తుకారం గేట్ స్టేషన్లతోపాటు ఉప్పల్, కొండాపూర్, ఎల్బీనగర్ పీఎస్‌లలోను ఇదే తరహా కేసులు నమోదు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు కూడా ఆయన్ని వెంటాడుతోంది. ప్రవీణ్‌ది హత్యానంటూ చేసిన కామెంట్స్‌పై ఆధారాలు సమర్పించాలని రాజమండ్రి పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు పాస్టర్ అజయ్‌ను విచారణకు పిలించారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పాస్టర్ అజయ్ బంధువులు చెబుతున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనంటూ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో అజయ్ మాట్లాడారు. అంత గట్టిగా ఆరోపణలు చేసినందుకు దానికి సరిపడా ఆధారాలు ఉంటే సమర్పించాలని రాజమండ్రి పోలీసులు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదైన కేసుల్లో హిందు సంఘాల నేతలతోపాటు, ఆర్సీఎం చర్చి ఫాదర్ జోసెఫ్ కూడా పాస్టర్ అజయ్‌పై కేసు పెట్టారు.
యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు పగలగొడతామని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడిన మాటలపై ఫాదర్ జోసెఫ్ తుకారాం గెట్ పీఎస్‌లో కేసు పెట్టారు. ఈకేసు కిందే పాస్టర్ అజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. త్వరలో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని మిగతా కేసుల విషయంపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు పాస్టర్ అజయ్ తరుపు న్యాయవాదులు చెబుతున్నారు.
చంచల్‌గూడా జైలులో ఉన్న పాస్టర్ అజయ్‌తో సన్నిహితులు, న్యాయవాదులు మాట్లాడినట్లు చెప్పారు. జైలులో అధికారులు తీవ్రంగా తనను దూషిస్తున్నట్లు పాస్టర్ అజయ్ వారి ముందు వాపోయినట్లు తెలిసింది. చెప్పుకోలేని విధంగా తిడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతి తర్వాత అజయ్ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో మరో సంచలనంగా మారింది.