Telangana Latest news: తెలంగాణ రాష్ట్ర సాధకులు, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ని కించపరుస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో కెపి.వివేకానంద్, సంజయ్  విజయుడు మాట్లాడారు. 

బండి సంజయ్‌ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. బాధ్యత గల పదవిలో ఉండి కెసిఆర్ పట్ల చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బిజెపి అధ్యక్ష పదవి దక్కించుకోవడం కోసమే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హోంశాఖ సహాయక మంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం ఆ పదవిని కించపరిచేలా ఉందన్నారు.  

బండి సంజయ్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఎమ్మెలేయ కెపి.వివేకానంద్ అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే హైదరాబాద్‌కు ఒక నేషనల్ పార్క్, నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. అలాంటి దమ్ము, ధైర్యం లేకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.  

రెచ్చగొట్టే మాటలతో రాజకీయాలు చేయాలని బండి సంజయ్ చూస్తున్నారన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. రెచ్చగొట్టే మాటలతో ప్రజలను, ఇతర పార్టీల నాయకులను కించపరిచే ఇలాంటి నాయకులను ఇప్పటికైనా ప్రధాని మోడీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  

మరోవైపు ఆయన చేసిన కామెంట్స్‌కు భగ్గుమంటున్న బీఆర్‌ఎస్‌ పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తోపాటు పలువురు నేతలు బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసుపెట్టారు. 

స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్ నేతలు కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. వైషమ్యాలు సృష్టించి రాజకీయపబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.  

ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారు?కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించి ఎన్నికల్లో పంచాడని కేంద్రంమంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనకు బీదర్‌లో దొంగ నోట్లు ప్రింటింగ్ చేసే మిషన్ ఉందని అన్నారు.   

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న ప్రవీణ్ కుమార్ గతంలో చేేసిన కామెంట్స్‌ను తాజాగా బండి సంజయ్ పోస్టు చేశారు. ఆయన దొంగనోట్లు ముద్రించారని బీఎస్పీలో ఉన్నప్పుడు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.