Telangana Assembly Elections: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే పార్టీలు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రతిపక్షాలకు దీటుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటర్ల జాబితా, ఈవీఎంల సన్నద్ధం, అధికారులకు శిక్షణ, అవగాహనా కార్యక్రమాలను ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్నాయి. 10, 15 రోజుల్లో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది. 


ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ అధికారుల బృందం.. ఎన్నికల ఏర్పాట్లు, సన్నాహకాలు పర్యవేక్షించనుంది. కొందరు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సీఈసీ సహా ఇతర కమిషనర్లు.. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్నారు. గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారుల బృందం సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనుంది.


ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం కానున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత కానుకలకి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపడుతోంది. డబ్బు, మద్యం, కానుకలను అడ్డుకునేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ప్రధాన నియోజకవర్గాలు, ఎక్కువ వ్యయం చేసే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చర్చించనున్నారు. 


అసెంబ్లీ ఎన్నికలకు చేస్తున్న ఏర్పాట్లు, ప్రణాళికలను ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించనున్నారు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్ అధికారులు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రెండో రోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళికలు, పరిస్థితులు, ఏర్పాట్లను సమీక్షించనున్నారు. మూడో రోజు దివ్యాంగ ఓటర్లు, ఇతర వర్గాల ఓటర్లతో ఈసీ అధికారులు సమావేశం అవుతారు.


హాట్ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను గుర్తించడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కువగా వ్యయం చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలను, సమస్యాత్మక నియోజకవర్గాలుగా పరిగణించనున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. విచ్చలవిడి వ్యయానికి అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్రణాళిక రచించి.. అమలు చేయనున్నారు. అలాగే ఓటు హక్కు నమోదు చేసుకునేలా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య పరిచేందుకు అవగాహన, ప్రచార కార్యక్రమాలపైనా అధికారులు చర్చించనున్నారు.