Telangana Health Minister Damodar Rajanarsimha: ఆరోగ్య సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, వైద్య, ఆరోగ్యశాఖశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సూచనలు చేశారు. స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆయా సేవలను అందించాలని ఆయన ఆదేశించగా.. అందుకు అనుగుణంగా నగదు రహిత సేవలు అందిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ వెల్లడించింది.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేరట్‌ ట్రస్ట్‌ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, పోలీసు సిబ్బందికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తోంది. అయితే, ఆయా ఆస్పత్రులకు అందించాల్సిన బకాయిలు ఆలస్యం అవుతుండడంతో పట్ల స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నెల 20లోగా బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న నగదు రహిత సేవలను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ స్పందించి కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులతో చర్చించారు. 


ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా చెల్లించాల్సిన గత బకాయిలను సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అందిస్తున్న నగదు రహిత సేవలకు క్రమం తప్పకుండా బకాయిలు క్లియర్‌ చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఈ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటుందని స్పస్టం చేశారు. రోగులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి హామీతో ఈ నెల 20 నుంచి వైద్య సేవలు నిలుపుదల చేయాలని భావించిన తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. యథావిధిగా వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేసింది. అయితే, నిరంతరం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని మరోసారి అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. నిరంతరం నగదు రహిత వైద్య సేవలు కొనసాగిస్తామని మంత్రికి అసోసియేషన్‌ స్పష్టం చేసింది.