case filed against ktr and other brs party leaders | హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం (మే 30న) హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తెలంగాణ అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ గుర్తు తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు చార్మినార్ వద్ద నిరసన తెలిపారు. దాంతో చార్మినార్ పోలీసులు నిరసనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో పాటు పద్మారావు గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మాగంటి గోపినాథ్, ఇతర నేతలపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ కోసం బీఆర్ఎస్ నేతల పోరాటం
తెలంగాణ అధికారిక రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై ఇటు హైదరాబాద్‌లో, అటు వరంగల్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని రూపొందించారు. ఆరు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తూ కొత్త చిహ్నాలను రూపొందించడం తెలిసిందే.
అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు నిరసన తెలపడంతో ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వ ముద్రపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గింది. చిహ్నాని ఖరారు చేసే సమయంలో కొన్ని గుర్తులు వైరల్ కావడంతో అటు ఎంఐఎం నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను రూపొందించారని ఆరోపించగా, చివరి నిమిషంలో రాష్ట్ర చిహ్నం నిర్ణయంపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
వరంగల్ కోటలో మీడియా సమావేశం నిర్వహించి, నిరసన తెలిపిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఖమ్మం- వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ కుడా చైర్మన్ యాదవరెడ్డి సహాలు పలువురు బీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి చిల్లర కేసులకి తాము భయపడేది లేదని, తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి, చారిత్రక వైభవానికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.