Telangana News: తెలంగాణలో మరోసారి కేసీఆర్ కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య వార్ షురూ అయ్యింది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటే... అంత సీన్ లేదు... ఆయన తెలంగాణతో ముడిపడిన వ్యక్తి అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నాడు విలేకర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి... తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.
ఉదయం పది గంటలక ట్వీట్ చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..." నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు! నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరి పోసాడు! చిట్టినాయుడు! నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర KCR!" అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు...
సియోల్ వెళ్లి వచ్చిన మీడియా ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్నారు. ఆయనో కాలం చెల్లిన ఔషధంగ అభివర్ణించారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికి కేటీఆర్‌ను ఉపయోగించుకున్నానని... ఇప్పుడు కేటీఆర్ కోసం హరీష్‌ను వాడతానని అన్నారు. తర్వాత హరీష్‌ను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి రాజకీయ ఉనికి లేకుండా చేస్తానని అన్నారు.
దీపావళి అంటే ఎక్కడైనా చిచ్చుబుడ్లుతో పండగ చేసుకుంటారని కానీ సారాబుడ్లతో పండగ ఏంటని ప్రశ్నించారు రేవంత్. అక్కడ ఎలాంటి తప్పులు చేయకుంటే రాజ్‌పాకాల ెందుకు పారిపోయారని నిలదీశారు. దీపావళి తర్వాత బాంబులు పేలుతాయన్న మంత్రుల కామెంట్స్‌పై కూడా రేవంత్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ల కేసుల్లో విచారణ సాగుతోందని ఏమైనా జరగొచ్చని అన్నారు. అయితే కక్షపూరిత చర్యలు మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. విచారణ చేసిన సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
పని తీరులో తనది రాజ్‌మౌళి స్టైల్ అన్నారు రేవంత్ రెడ్డి. తనకు ఏం కావాలో ప్రజలు ఇచ్చారని... ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయంగా కొంత నష్టం ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే పాలన సాగిస్తున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు.
రియల్ ఎస్టేట్ తగ్గడం ఒక్క తెలంగాణలోనే జరగలేదని... ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా పరిస్థితి అలానే ఉందన్నారు రేవంత్. హైడ్రా పేరుతో చెరువుల్లో అక్రమంగా బలిసినోళ్లు కట్టిన నిర్మాణాలనే కూల్చేశామన్నారు. పేదోళ్ల జోలికి అసలు వెళ్లలేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంపై కూడా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పైసా ఖర్చు లేకుండానే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 5 సంస్థల కన్సార్సియంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసే బాధ్యత అప్పగిచామన్నారు రేవంత్. 18 నెలల్లో డీపీఆర్ వస్తుందని... దాని ఆధారంగా మేలైన మోడల్ ఎంచుకుని పనులు చేపడతామన్నారు.