Telangana: తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. మాజీమంత్రి హరీష్‌రావు, ఎంపీ సురేష్‌ రెడ్డితో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. వాటన్నింటినీ గుర్తు చేస్తూ... కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయపెట్టేందుకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. 


ఎప్పుడు రాజీనామా చేయిస్తారు?


ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారిన వారిని రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంటింటీ వెళ్లి బీఆర్‌ఎస్ నేతలను ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు కేటీఆర్. తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 షెడ్యూల్‌ను తప్పకుండా అమలు చేస్తామని ప్రతి మీటింగ్‌లో చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పే సమాధానం ఏంటని నిలదీశారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలను ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. వారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తారని రాహల్‌ను అడిగారు. 


జాతీయ స్థాయిలో పోరాటం


ఈ పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోందని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తామని గత తీర్పులను ఒక్కసారి గమనిస్తే కచ్చితంగా బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని అన్నారు కేటీఆర్. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై లోక్‌సభ స్పీకర్‌ను, ఎన్నికల సంఘాన్ని, రాష్ట్రపతిని కూడా కలుస్తామని తెలిపారు. 


అప్పుడు విలీనం చేసుకున్నాం


గతంలో బీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలను ఇలా రాజీనామాలు చేయించకుండానే పార్టీలో చేర్చుకుంది కదా అన్న సమాధానానికి కేటీఆర్ స్పందించారు. పార్టీ లెజిస్లేచర్‌ను విలీనం చేర్చుకోవడం వేరని నేతలు ఫిరాయించడం వేరని అన్నారు. అది రాజ్యాంగ బద్దమని చట్టం ప్రకారం అది చెల్లుబాటు అవుతుందని వాదించారు. జాతీయ పార్టీలు చేస్తున్న ఫిరాయింపు రాజకీయాల్లో అన్నిపార్టీలు బలిపశువులే అన్నారు కేటీఆర్. 


కాంగ్రెస్‌ ఎందుకిలా చేస్తోంది


యాంటి డిఫెక్షన్‌లా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే వలసలను ప్రోత్సహించిందని చరిత్ర గుర్తు చేశారు కేటీఆర్. ఇప్పుడు కూడా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... వలసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందన్నారు. గోవా, కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ... ఇప్పుడు తెలంగాణాలో BRS ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 


ఎన్ని కోట్లు ఇచ్చి కొంటున్నారు?


మణిపూర్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను సుప్రీం కోర్టు డిస్ క్వాలిఫై చేసిందని గుర్తు చేశారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. పార్లమెంట్‌లో రాహుల్ రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరని విమర్శించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.