Trending
Telangana Latest News: జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆందోళన-నేడు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం
Telangana Latest News: తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం చేయనుంది.
Telangana Latest News: బీఆర్‌ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై వేటుతో భారతీయ రాష్ట్ర సమితి భగ్గుమంటోంది. దీనిక వ్యతిరేకంగా శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేసేలా ఆందోళనకార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జగదీష్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ నేతలు సభలో ఆందోళన చేపట్టారు. మార్షల్స్‌తో వారిని బయటకు పంపించారు. అక్కడి నుంచి నేరుగా అంబేద్కకర్ విగ్రహం వద్దకు వచ్చిన గులాబీ పార్టీ నేతలు అక్కడ ధర్నాకు కూర్చొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై, సభ నడిపిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల హననం జరుగుతోందని ఆరోపించారు. వాటిని సభలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయకుండా చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే ఇది ప్రజాపాలన అని చేసేవి మాత్రం అప్రజాస్వామిక పనులని విమర్శించారు.
కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏకపక్షంగా జగదీశ్‌రెడ్డి గొంతు నొక్కుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన ఒక్కడికే జరిగిన అవమానం కాదని ఇది ప్రజలకు జరిగిన అవమానంగా అభిప్రాయపడ్డారు. ఆయన ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే అక్కసుతోనే ఇలా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఇచ్చిన హామీలు అమలు అమలు చేయడం చేతకాని విషయాన్ని ప్రజలు గమనించారని అందుకే ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు.
ఒక్కరి సస్పెండ్‌తో బీఆర్‌ఎస్‌ను అడ్డుకోలేరని మిగతా సభ్యులు ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కమీషన్లు, కాంట్రాక్టులు, 420 హామీలు, ఢిల్లీకి మూటలు అన్నింటి సంగతి తేలుస్తామని అన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పే కార్యక్రమం మొదలైందనే తనను సభకు దూరం చేశారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తనను సస్పెండ్ చేయడానికి ఒక్కటంటే ఒక కారణం కూడా చూపించలేకపోయారని అన్నారు. తాను సభలో మాట్లాడటం మొదలు పెట్టిన వెంటనే అధికార పక్ష సభ్యులు అరవడం స్టార్ట్ చేశారని అన్నారు. కాంగ్రెస్ సభ్యులను కంట్రోల్ చేసి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని స్పీకర్‌కి రిక్వస్ట్ చేసినట్టు చెప్పారు. సభ కాంగ్రెస్ పార్టీది కాదని అన్నానే తప్ప తాను ఎక్కడా స్పీకర్‌ను కించపరచలేదని చెప్పుకొచ్చారు జగదీష్ రెడ్డి. కానీ, అనని మాటలను పట్టుకొని నిస్సిగ్గుగా తమపై ఎదురుదాడి చేశారని అన్నారు. తమకు ఛాన్స్ ఇవ్వకుండా పాతికమంది ఎమ్మెల్యేలతో తిట్టించారని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారని అందుకే గురువారం హడావుడి చేశారని అన్నారు. తన గొంతు వినపడకుండా ఉండేందుకు సస్పెండ్ చేశారని అన్నారు. ఇలాంటివి చాలానే చూశామని చెప్పుకొచ్చారు. తామంతా కేసీఆర్ సైన్యమని తెలిపారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదని ప్రజల ముందుకు వెళ్లి కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని తెలియజేస్తామని వివరించారు.