BRS MLC Damodar: నాగర్ కర్నూలు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల మాజీ మంత్రి జూపల్లి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత దామెదర్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరు అయ్యారు. ఈ విషయం కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


కొన్ని రోజులుగా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు విధిగా హాజరవుతూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గద్వాలలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు కూడా దామోదర్ రెడ్డి హాజరయ్యారు. తాజాగా బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూడా బాధితులకు పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం చర్చకు దారితీసింది. దీంతో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి అనధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 


20 ఏళ్ల పాటు పని చేసిన పార్టీలో మళ్లీ చేరాలంటే..


దామోదర్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని నేతలు అంటున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వంపై ధీమాగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మధ్య సంబంధాలు అంతగా బాలేవన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలోనూ వీరిద్దరూ పెద్దగా కలిసి మాట్లాడుకున్నట్లు కనిపించ లేదు. కాగా, ఇటీవలె కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని.. దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్ని తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితుల గురించి చర్చించారు. మల్లు రవితో భేటీ అనంతరం దామోదర్ రెడ్డి మీడియా ముఖంగా స్పందించారు. నాగం జనార్ధన్  రెడ్డితో మాట్లాడిన తర్వాత తన తుది నిర్ణయం ఉంటుందని అప్పుడు దామోదర్ రెడ్డి ప్రకటించారు. నాగంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొన్ని ఇబ్బందులు వచ్చి హస్తం పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. 


షోకాజ్ నోటీసు ఇస్తే తుది నిర్ణయం


తాను 20 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో ఉన్నానని, కొన్ని సమస్యల వల్ల పార్టీ ని వీడినట్లు తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఎలా ఉంటుందని మల్లు రవిని అడిగినట్లు అప్పుడు దామోదర్ వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా ఆహ్వానించినట్లు కూచుకుళ్ల పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న దామోదర్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇస్తే తన పార్టీ మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటానని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగానే.. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యాలయంలో పాల్గొనడం చర్చకు దారితీసింది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.