Kaushik Reddy Comments: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతుందన్న ఆయన.. తాము అధికారంలోకి వస్తే ఎవర్నీ విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని... తనపై జరిగిన దాడి తర్వాత పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని అన్నారు. 


తెలంగాణ బీఆర్‌ఎస్ వర్సెస్‌ రేవంత్ రెడ్డి అన్నట్టు రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డిపైనే ఎక్కువ ఫోకస్ చేసి బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యేను చంపడానికే ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డి. దాదాపు వారం రోజు నుంచి సాగుతున్న హైడ్రామాలో మరోసారి కౌశిక్ రెడ్డి తీవ్ర కామెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయంశమయ్యాయి. 


కౌశిక్ రెడ్డి తన హత్య గురించే కాకుండా పీసీసీ చీఫ్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా రోజుకో రకంగా మాట్లాడుతూ టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోతున్నారు. తెలంగాణ భవన్‌లో వివేక్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి తనను హత్య చేయడానికి మనుషులను పంపించినట్టు రేవంత్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. దీనిపై డీజీపీ, హోంశాఖ సెక్రటరీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


వ్యక్తిగత ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు తనకు ఏమైనా జరిగితే దానికి రేవంత్ రెడ్డే బాధ్యుడు అవుతారని హెచ్చరించారు. వందల మంది పోలీసులు సహకారంతోనే తనపై దాడికి యత్నించారన్నారు. తాను తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి వీపు చింతపండు చేస్తారని ఆరోజులు దగ్గర్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. 


పోలీసుల తీరుపై కూడా కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తానన్న అరెస్టు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు దాడులకు వచ్చినా వదిలేస్తున్నారని ఆరోపించారు. వీటిపై మాట్లాడాల్సిన మంత్రులు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మారిన వారిపై వేటు ఖాయమని ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని అందులో కూడా బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని అన్నారు. 
అధికార మదంతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నారని అన్నారు కౌశిక్ రెడ్డి. తన కాళ్లు మొక్కితేనే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారని అన్నారు. ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి వీపు చింతపండు అయిందన్నారు. అన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో వాళ్లు రేవంత్‌కు బుద్ధి చెబుతారన్నారు. 


Also Read: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు