Harish Rao: ప్రభుత్వం ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌కు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మాజీ మంత్రి బీఆర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులను సులభతరం చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రమోషన్స్ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగులతో సీఎం రేవంత్ ఇవాళ సమావేశం కానున్నారు. అంతకంటే ముందే ఈ సమస్యలపై స్పందించాలని హరీష్ డిమాండ్ చేశారు. 


సీపీఎస్ రద్దు ఎప్పుడు?


గతంలో కేసీఆర్ ఇచ్చిన పిఆర్సి కంటే గొప్పది ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కర్ణాటకలో కొత్త పిఆర్సీ ఇప్పటికే అమలులోకి వచ్చింది, తెలంగాణలో మెరుగైన పిఆర్సి  ఎప్పటి నుంచి అమలుచేస్తారో చెప్పాలని హరీష్‌ ప్రశ్నించారు. "మీరు మీ పార్టీ  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం  కనీసం పెండింగ్‌లో ఉన్న 4 డిఎలు ఎప్పుడు ఇస్తారో చెబితే అందరూ సంతోషిస్తారు. న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకు వస్తామన్నారు. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో సభలో ప్రకటించాలి" అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. 


"సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చారు. 8 నెలలు అయినా ఆ ఊసేలేదు. వారి సమస్యను ఎప్పుడు తీరుస్తారో సభాముఖంగా ప్రకటించండి. పాఠశాలలకు స్కావెంజర్స్‌ను అనుమతిస్తామన్న మీ హామీని ఎప్పుడు కార్యరూపంలోకి వస్తుందో చెప్పండి. పాఠశాలలకు ఉచిత విద్యుత్‌తోపాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయి వాటినీ పరిష్కరించాల్సి." అని తన లేఖలో పేర్కొన్నారు హరీష్‌రావు. 


పెండింగ్‌ బిల్లులు చెల్లించండి


బదిలీ అయ్యి ఇప్పటివరకూ ఆ బడిలో చేరని ఎస్.జి.టి ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్నారు హరీష్‌. బదిలీలతో ఖాలీ అయిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను నియమించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని లేఖలో తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల వేతనాలు కూడా పెంచుతామి చెప్పారని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట ఇచ్చే టిఫిన్‌ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.    


బదీలు, ప్రమోషన్స్‌కు అనుమతులు ఇచ్చింది తామే


మరోవైపు ప్రమోషన్‌ వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడబోతున్న సీఎం పై సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలి అన్నారు హరీష్‌. అదే టైంలో ఇప్పుడు తమవిగా చెప్పుకుంటున్న కొన్ని  అంశాలు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలని గుర్తు చేశారు. 10,468 పండిత, పి.యిటీ పోస్టుల అప్ గ్రేడేషన్‌కు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. సర్వీసురూల్స్ 11, 12 మార్చామని కొత్తగా 2,3, 9,10 జి.ఓలు తీసుకొచ్చామన్నారు. 


కష్టకాలంలోనే పీఆర్‌సీ ఇచ్చాం


2023 సెప్టెంబర్ 18 నాడు కాళేశ్వరం జోన్ 1లో 1050 గజిటెడ్ ప్రధానోపాధ్యాయ ప్రమోషన్లు ఇచ్చామన్నారు. ప్రాథమిక పాఠశాలలకు 10,000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేశామన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు కూడా గతప్రభుత్వమే లాంఛనాలు పూర్తిచేసిందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి దఫా 43 శాతం, రెండోసారి 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. కరోనాతో కష్టాల్లో ఉన్నప్పటికీ 30 శాతం పి.ఆర్.సి ప్రకటించామని తెలియజేశారు.