తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలు రోడ్లపైకి వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ లీడర్ల అంతా తెలంగాణ పీసీసీ చీఫ్‌ చేసిన కామెంట్స్‌పై గుస్స అయితున్నారు. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ కాంగ్రెస్ దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. 


రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పోరు తీవ్రతరం చేసింది. మంగళవారం పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తే బుధవారం రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్కారోకోలు చేశారు. ఖబడ్దార్ రేవంత్‌ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీళ్లంతా రైతు వ్యతిరేకులని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 


ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధా వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. 


ప్రతి జిల్లాలో ఆయా జిల్లాల మంత్రులు, ఇతర సీనియర్ నేతలు ధర్నాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని ఊళ్లలోకి రానియొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తామని, ఇప్పుడు ఉచిత విద్యుత్ తీసేస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని అలాంటి వారిని నమ్ముకంటే మరోసారి సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 


కవిత ఉదయం ట్వీట్ కూడా చేశారు. నేరుగా రాహుల్ గాంధీకే ట్యాగ్ చేస్తూ రేవంత్ చేసిన కామెంట్స్‌పై నిలదీశారు. అసలు తెలంగాణ రైతులపై అక్కసు ఎందుకని నిలదీశారు. 






అంతకు ముందు ట్వీట్ చేసిన కేటీఆర్‌.... సీఎం కేసీఅర్ నినాదం మూడు పంటలు అయితే.. కాంగ్రెస్ విధానం మూడు గంటలని... బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా మూడు గంటలు కావాలా... మతం పేరిట మంటలు కావాలా తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అన్నారు.