Urea for Telangana Farmers | హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడుతూ, ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు, చెప్పులు పెట్టి రాత్రింబవళ్లు కష్టాలు పడుతుంటే, దీనిని ప్రతిపక్షాల దుష్ప్రచారంగా కొట్టిపారేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) విమర్శించారు.

“రైతులు యూరియా బస్తాల కోసం అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకోవడం అబద్ధమా? అన్నం పెట్టే రైతన్నలపై పోలీసులు లాఠీలు వేసింది అబద్ధమా?”. రైతుల ఆవేదనను సీరియస్‌గా తీసుకోకుండా పాలనను నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది తగునా’’ అని హరీష్ రావు ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి హామీలన్నీ ‘బూటకపు వాగ్దానాలు’రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా, తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు పేరుతో రెండు నెలలు పాలనను గాలికొదిలేసిందని హరీష్ రావు మండిపడ్డారు. తులం బంగారం ఇస్తామంటూ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రగల్భాలు పలికిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, యూరియానే బంగారంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఓవైపు గ్రామాల్లో మద్యం వరదలా పారిస్తూనే, రైతులకు కావలసిన యూరియా మాత్రం అందుబాటులో ఉంచలేకపోయారని.. పరిపాలన చేయడం అంత ఈజీ కాదని రేవంత్ నిరూపించాడు” అని హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

రైతు సంక్షేమంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంహరీష్ రావు ఇంకా ఏమన్నారంటే.. తెలంగాణ ప్రభుత్వం పలు అంశాల్లో ఫెయిల్ అయిందని మండిపడ్డారు. వాటిలో సాగు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, పంట కొనుగోళ్లలో ఫెయిల్, 500 బోనస్ హామీలో ఫెయిల్, రైతు భరోసాలో ఫెయిల్, రుణమాఫీలో ఫెయిల్, చివరకు యూరియా సరఫరాలో కూడా ఫెయిల్.. అని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. 

‘తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ బిఆర్ఎస్ (BRS) పాలనలో ఒక్కసారైనా యూరియా కొరత రాలేదు. మా హయాంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. కానీ ఇప్పుడు రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి. తక్షణం రైతులకు ఎరువుల సమస్యపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలోని అన్నదాతలకు కావలసిన యూరియాను సరఫరా చేయాలని’ బిఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు.