Sahasra Murder For Bat: హైదరాబాద్ కూకట్ పల్లిలో బాలికను హత్య చేసిన బాలుడి ఘటనలో పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ప్రచారం జరుగుతున్నట్లుగా డబ్బుల దొంగతనం కోసం ఈ హత్య జరగలేదని.. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిదని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని.. బ్యాట్ దొంగతనం కోసం నెల రోజుల ముందే బాలుడు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలిపారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబానికి, హంతకుడి కుటుంబానికి పరిచయాలు ఉన్నాయి. ఇరువురి ఇళ్లల్లో ఏవైనా వేడుకలు జరిగితే వచ్చిపోతూంటారు. గత ఏడాది సహస్ర బర్త్ డే వేడుకలకూ ఆ బాలుడు వెళ్లాడు. సహస్ర తమ్ముడితోనూ నిందితుడు స్నేహంగా ఉంటూ ఇద్దరూ క్రికెట్ ఆడేవారు. సహస్ర తమ్ముడి వద్ద క్రికెట్ బ్యాట్ ఉంది. అది ఇవ్వాలని అడిగినా ఎప్పుడూ ఇవ్వకపోవడంతో దాన్ని దొంగతనం చేయాలని అనుకున్నాడు. ఓటీటీలు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న బాలుడు... దొంగతనం చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు. నెల రోజుల పాటు ఇందు కోసం పరిస్థితులు గమనిస్తూ వస్తున్నాడు. దొంగతనం ఎలా చేయాలో బాలుడు ముందుగానే స్లిప్‌లో రాసుకున్నాడు. చివరిలో మిషన్ డన్ అని కూడా స్లిప్‌లో రాసుకున్నాడు.
బ్యాట్ దొంగతనం చేయాలనుకున్న రోజున అందరూ పనులకు వెళ్లారని నిర్దారించుకున్న తర్వాత బ్యాట్ దొంగతనం కోసం సహస్ర ఇంటికి వెళ్లాడు. కిచెన్ లో ఉన్న బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర గుర్తించి చొక్కా పట్టుకుంది. ఆపై బాలికను తోసేసి కళ్లు మూసి విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.
సహస్ర హత్య తరువాత బాలుడు తల్లికి కూడా అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని బాలుడ్ని కూడా అడిగింది. అయితే తాను చంపలేదని.. కానీ నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావని తల్లిపై తిరగబడినట్లుగా పోలీసులు చెప్పారు. పోలీసులకు బాలుడుపై ముందే అనుమానం వచ్చిందని.. ప్రాసెస్ ప్రకారం విచారిస్తూ వచ్చే సరికి ఆలస్యం అయింది. వేరే వారు కూడా గోడ వద్ద బాలుడు తచ్చాడుతూ ఉన్న విషయాన్ని చూసి మాకు చెప్పారని పోలీసులు ప్రకటించారు. మర్డర్ తరువాత బాలుడు షర్ట్ కు రక్తం మరకలు అంటుకున్నాయని.. దండెం మీద ఆరేసిన షర్టును అడ్డుపెట్టుకొని ఇంట్లోకి వెళ్లి స్నానం చేశాడన్నారు.
బాలుడు రెండు నెలల కిందట ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని.. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నామన్నారు. బాలుడి ఇంట్లో కూడా ఫోన్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని.. దాన్ని బట్టి ఇతర నేరాలు ఇంకేమైనా చేశాడా అనే విషయంపై విచారణ చేస్తున్నామని సీపీ మహంతి తెలిపారు. ఓ చిన్న బ్యాట్ కోసం ఏ మాత్రం సంకోచించకుండా బాలిక ప్రాణాలు తీసిన బాలుడి ఉదంతం అందర్నీ షాక్‌కు గురి చేసింది.
అయితే ఈ హత్య కేసులో ఆ బాలుడే కాదు.. అతని తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని..వారిపై కూడా కేసులు నమోదు చేయాలని సహస్ర తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు.