Nindu Manasulu Serial Today Episode గణ వీడియో వైరల్ అయిందని ఐశ్వర్య ప్రేరణకు చెప్తుంది. మనల్ని ఇబ్బంది పెట్టిన వాడికి మంచి పని అయిందని ఐశ్వర్య అంటుంది. ప్రేరణ సిద్ధూకి బుద్ధి లేదని తిడుతుంది. ఇలాంటి వాడి వీడియో తీయడం తప్పులేదులే అక్క అని ఐశ్యర్య అంటే దానికి ప్రేరణ ఈ వీడియో తీసినప్పుడు నేను అక్కడే ఉన్నాను.. ఆ గణ ఇదంతా నేనే చేయించానని అనుకుంటాడని చెల్లితో చెప్తుంది. 

సిద్ధూ ఏందంటే అది చేసేస్తాడు ఛా అనుకుంటూ ప్రేరణ సిద్ధూకి కాల్ చేసి వీడియో ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావని చెడామడా తిట్టేస్తుంది. నాకేం తెలీదు నేను పెట్టలేదు అని సిద్ధూ చెప్పినా వినకుండా తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. సిద్ధూ తన ఫ్రెండ్ కుమార్‌ని పిలిచి వీడియో ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావ్రా అని అడుగుతాడు. అప్పుడే వైరల్ అయిపోయిందా అని కుమార్ అనడంతో చెప్పు తీసుకొని కొడతా ఎవడ్రా నిన్ను పెట్టమని అన్నారు..  వైరల్ అవ్వడం కాదు ఆ అమ్మాయి నేనే పెట్టానని నన్ను తిడుతుంది. చెప్పినా వినడం లేదు అని అంటాడు.  దానికి కుమార్ ఆ గణ ఏం ఉత్తముడు కాదు వాడికి అది జరగాల్సిందే అంటాడు. 

గణ వైరల్ అయిన తన వీడియో చూసి రగిలిపోతూ ఆ ప్రేరణ ఇంతకు తెగిస్తుందని అనుకోలేదమ్మా అని అంటాడు. దానికి ఈశ్వరి పదే పదే గర్జిస్తే సింహం కూడా చిట్టెలుకకు లోకువ అయిపోతుంది. అది నిన్ను అలాగే అనుకుంటుంది ఇంత చెప్పినా నీకు ఎందుకు అర్థం కావడం లేదు.. ఎందుకు ఆవేశ పడుతున్నావ్.. ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. కాపు కాచి కొట్టే దెబ్బ ఎదురు నిల్చొని కొట్టే దెబ్బకు ఉండదు గణ అని చెప్తుంది. ఆవేశం పక్కన పెట్టి ఆలోచించి ముందుకు వెళ్లు .. ఈ సారి నువ్వు కొట్టే దెబ్బకి దాని బతుకే ఛిద్రం కావాలి గుర్తు పెట్టుకో అని చెప్తుంది. 

గణ కోపంగా అది ఎంత దాని బతుకు ఎంత నా కాలి కింద నలిగిపోయే చీమ అది అని కోపంగా ప్రేరణకు కాల్ చేస్తాడు. ప్రేరణ ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు కాల్ చేస్తావ్ అనుకున్నా అంటుంది. గణ ప్రేరణతో తప్పు చేశావ్ వాడితో చేతులు కలిపి నా వీడియో వైరల్ చేశానని సంబర పడుతున్నావ్ కదూ నీ అంతు చూస్తా అని అంటాడు. ప్రేరణ గణతో ఈ వీడియోని నేను పోస్ట్ చేయలేదు. నాకు ఆ వీడియోకి సంబంధం లేదు.. నేను ఎవరితో చేతులు కలపలేదు.. నేను ఏది అయినా ఎవరినైనా డైరెక్ట్‌గా ఎదుర్కొంటా. మా నాన్న నాకు ఆ ధైర్యం ఇచ్చారు అని ప్రేరణ అంటుంది. నీకు టైం దగ్గర పడిందే మా నాన్న అన్న మాట నీ నోట రాకుండా గణ అంటే భయపడేలా చేస్తా.. నీ ఉనికే లేకుండా చేస్తా అని అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవ్.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నా నువ్వు నన్ను ఆపలేవ్ అని ప్రేరణ చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. 

ఐశ్వర్య రంజిత్‌ని తిట్టుకుంటూ రంజిత్ టీ షర్ట్ ఐరెన్ చేస్తుంది. ఇంతలో ఇందిర వంట చూడమని చెప్పడంతో ఐరెన్ బాక్స్ వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో టీ షర్ట్ కాలిపోతుంది. తర్వాత ఐశ్వర్య చూసి నా పని అయిపోయింది ఈ రోజు ఆ రూల్స్ రంజిత్ చంపేస్తాడని అనుకుంటుంది. ఇంతలో రంజిత్ వచ్చి కాల్చేశావా ఒక్క పని తిన్నగా చేయవా అని తిడతాడు. ఐశ్వర్య బుంగ మూతి పెడుతుంది. ఇంతలో రంజిత్‌కి ఫోన్ రావడంతో మాట్లాడుతూ టీ షర్ట్ తనది అని మర్చిపోతాడు. ఐశ్వర్యకి కొత్త టీషర్ట్ కొనుక్కో అంటాడు. ఐశ్వర్య నోరెళ్లబెడుతుంది. ఇందాకే తిట్టారు కదా అంటే నేను తిట్టానా ఏంటి ఏమైంది అని అడుగుతాడు. నువ్వు నా టీషర్ట్స్ అన్నీ ఐరెన్ చేయాలి తీసుకొస్తా రూల్స్ బాగా ఫాలో అవుతున్నావని అంటాడు. వీడేంటి ఇప్పటి వరకు తిట్టి ఇప్పుడు పొగుడుతున్నాడు కచ్చితంగా వీడు తేడానే అనుకుంటుంది. 

విజయానంద్‌ కూర్చొని ఉంటే సిద్ధూ వెళ్లి కాఫీ ఇస్తాడు. సిద్ధూ నువ్వా అని విజయానంద్ అంటే ఏం షాక్ అయ్యావా అంటే ఈ క్షణం కోసమే నేను ఇన్నాళ్లు ఎదురు చూసింది అని అంటాడు. సిద్ధూ తండ్రితో నటనలో నువ్వు సీనియర్‌ ఏమో కానీ నిజాయితీలో నన్ను ఎదుర్కొలేవ్ అంటాడు. ఏదో సాధించేశావని విర్రవీగుతున్నావా అని విజయానంద్‌ అంటే నువ్వు నా కాళ్లకి వేసిన సంకెళ్లను తొక్కేశా అని చెప్పడానికి వచ్చా.. నువ్వు నన్ను ఏం చేయలేవ్.. నీ డబ్బుకి పరపతికి దూరంగా నా టాలెంట్‌తో కోచింగ్ తీసుకోబోతున్నా నా లక్ష్యం చేరుకోబోతున్నా అది నీకు చెప్పాలనే వచ్చా నా జోలికి రావొద్దు నా ప్రపంచాన్ని టచ్ చేయొద్దు నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అంటాడు. 

సాహితి, వచ్చి కంగ్రాట్స్ చెప్తుంది. మంజు కూడా వస్తుంది. విజయానంద్ మంజుతో బాబు తన ఆనందాన్ని మనతో పంచుకోవడానికి వచ్చాడని అంటాడు. మంజుల కొడుకుతో పట్టుగల వాడివి నువ్వు సాధిస్తావని నాకు తెలుసు అని పెన్ సిద్ధూ జేబులో పెడుతుంది. మూర్ఖత్వం కాస్త తగ్గించుకోరా.. మంచి ఫ్యూచర్ ఉన్న వాడివి ఇలాంటి నేచర్ ఎందుకు అని అడిగితే నీ కొడుకుని కదా అని అంటాడు. అందుకే చెప్తున్నారా తెలివి ఉంది పట్టుదల ఉంది.. ఏదైనా సాధించగల ధైర్యం ఉంది.. అలాగే మా మీద ఇంటి మీద ప్రేమ ఉంటే ఇంటికి వచ్చేయ్ నాన్న అంటుంది. దానికి సిద్ధూ ప్రపంచంతో పోటీ పడే వాడు మనుషుల్ని సాధించే మనుషుల మధ్యకు రాలేడు ఉండలేడు అది జరగని పని అని అంటాడు. విజయానంద్ హమ్మయ్యా అనుకుంటాడు. సిద్ధూ వెళ్తానని చెప్పి పెన్‌ పట్టుకొని థ్యాంక్స్ అమ్మా అంటాడు.

గణకు ఆంజనేయులు కాల్ చేసి ప్రేరణ అడ్రస్‌ దొరికిందని చెప్తాడు. ప్రేరణ ఇక నీకు ఇళ్లు ఉండదు అని అనుకుంటాడు. సుధాకర్, ఇందిర మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఇంతలో ఎదురుగా ఈశ్వరి నిల్చొంటుంది. సుధాకర్ బిత్తరపోతాడు. మేడం మేడం అని ఏం చేయలేక నవ్వుతాడు. ఈశ్వరి ఇందిరతో ఏమ్మా నీకు ఎన్ని సార్లు కాల్ చేయాలి.. చాలా సార్లు చేశాను నీ ఫోన్ కలవడం లేదు అంటుంది. ఇందిరకు సుధాకర్ మీద డౌట్ వస్తుంది. సుధాకర్‌తో ఈశ్వరి ఈవిడ ఊరు వెళ్లిపోయిందని చెప్పావు కదా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.