Harish Rao Comments on Telangana Farmers Issue | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా అనేది బ్రహ్మ పదార్థంగా మారిందని, రాష్ట్రంలో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదాత పట్ల ప్రభుత్వంది వంచన చేస్తోంది, 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానని చెప్పి చేయనందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


రూ.2 లక్షలకు పైగా రుణంఉన్న రైతులు మిగతా డబ్బు బ్యాంకులకు కట్టాలంటున్నారు, అయితే ఎందుకు కట్టాలి. కేసీఆర్ హయాంలో ఇలాంటి నిబంధనలు ఏవైనా ఉన్నాయా ? వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ నేతలు కొత్త కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేయని వారికి ఇన్ని పదవులు ఎందుకు ? పెట్టుబడి సాయం అంటే మీకు అర్థం తెలుసా ? ముఖ్యమంత్రిగా కేసీఆర్ 11 విడతలుగా రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు యాసంగి పంట వేసే టైమ్ దగ్గరపడుతున్నా.. వానా కాలం రైతు బంధు ఇవ్వలేదు. వడ్లకు బోనస్ బోగస్ గా మార్చారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పోరాడుతోంది.  


రుణమాఫీ కావడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులను గవర్నర్ కు అందజేస్తాం. లక్షా 32 వేల ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. కేసీఆర్ హయాంలో పోలీసులకు స్టేషనరీ ఖర్చుకు నెలకు డబ్బులు ఇచ్చాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పోలీసు అధికారుల ఎవరి ఒత్తిడికి తలొగ్గి మాట్లాడొద్దు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులకు సరెండర్ Leave Encashment మెంట్ ఎందుకు కావడం లేదు. పోలీసు అధికారుల సంఘం వీనిపై ఎందుకు ప్రశ్నించదు ? రేవంత్ పాలనలో మత కలహాలు పెరగడం నిజం కాదా ? 9 నెలల కాంగ్రెస్ పాలనలో 247 అక్రమ ఆయుధ కేసులు నమోదయ్యాయి.



మేడ్చల్ లో అగ్రికల్చర్ ఆఫీసు ముందు లేఖ రాసి సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు apgvbలో అప్పు ఉంది. సురేందర్ రెడ్డి తల్లి పేరిట లక్షా 15 వేలు, సురేందర్ రెడ్డి పేరిట లక్షా 92 వేలు అప్పులున్నాయి. కానీ బ్యాంకు మేనేజర్ అనిరుద్ కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెప్పడంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య లేఖలో అన్ని విషయాలు వెల్లడించాడు. రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చెప్పాడు. కానీ సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో రేషన్ కార్డుకు రైతు రుణమాఫీకి లింక్ ఉందని తేలింది. రేవంత్ పాలనకు సురేందర్ రెడ్డి లేఖ పోస్టుమార్టం లాంటిది.
 


సిద్దిపేట నియోజకవర్గం లో జక్కాపూర్ గ్రామంలో గురజాల బాల్ రెడ్డి ఫ్యామిలీలో ముగ్గురిపై లోన్ ఉంది. 6 లక్షల లోన్ ఉంటే, కేవలం రూ.2 లక్షలు మాఫీ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 31 సాకులు చూపెట్టింది. నారాయణ్ పేటకు చెందిన నల్ల మణెమ్మకు లక్ష రూపాయల అప్పు ఉంది. 2010లో చనిపోయిన భర్త ఆధార్ కార్డు తెస్తేనే రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఇది సాధ్యమేనా. చాట్ల హరీష్, కుంభాల సిద్ధారెడ్డి అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తేవాలన్నారు. పెళ్లికాని ఆ ఇద్దరు భార్యల పేరిట ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారు ? 20 లక్షల మందికే రుణమాఫి అయ్యింది. 21 లక్షల రైతుల మందికి పెండింగ్ ఉంది. కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్, కాంగ్రెస్ అంటే కోతలు, ఇది కటింగ్ ప్రభుత్వంగా కనిపిస్తోందని’ రైతు రుణమాఫీపై, రైతుల సమస్యలపై హరీష్ రావు వివరించారు.


Also Read: ఒవైసి కాలేజీ ఎప్పుడు కూల్చుతారు? రేవంత్ రెడ్డి భయపడ్డారా ! లేక రాజీపడ్డారా?: రాజాసింగ్ సంచలనం