Sabita indra reddy reacts on CM Revanth : శాసన సభా సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపులపై మంత్రి సీతక్క మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్​లోకి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డితో పార్టీ ఫిరాయింపులపై గవర్నర్​కు ఫిర్యాదు ఇప్పించారని సీతక్క ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. అనంతరం మంత్రి సీతక్క వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తనను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తాను సంతోషంగా ఆహ్వానించానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆశాకిరణం అవుతావని చెప్పానని, సీఎం అవుతావని కూడా చెప్పానని సబిత గుర్తు చేశారు. రేవంత్‌ సీఎం అవుతావని చెప్పి మరీ గతంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు. అయినా తనపై ఆయన ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.  


తమ్ముడిని మోసం చేశారు
తర్వాత సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై  సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె తనను పార్టీలోకి ఆహ్మానించిన మాట వాస్తవమేనన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను అసెంబ్లీలో ప్రస్తావించారు. 2019ఎన్నికల సమయంలో తనను మల్కాజిగిరిలో పోటీచేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరిందని..  ఆ సమయంలో తనకు అండగా ఉంటానని సబిత మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు.  అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నారని అన్నారు. తమ్ముడిగా తనను మోసం చేశారని రేవంత్ విమర్శించారు.రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సభలో ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలతో స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


అక్కలు అందరి క్షేమం కోరతారు
అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. సీఎం అలా ఎందుకు మాట్లాడారో తమకు అర్ధం కాలేదంటూ తెలిపారు. కేటీఆర్‌ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, కేటీఆర్‌ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదన్నారు.  అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్‌ అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్కలు ఎప్పుడైనా అందరి క్షేమాన్ని కోరుకుంటారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిని చూశాను. మీ వెనకున్న అక్కలే మమ్మల్ని ముంచారని సీఎం అన్నారు. మిమ్మల్ని కూడా ముంచుతారని కేటీఆర్‌తో సీఎం వ్యాఖ్యానించారు.  ఆ రోజు సోనియాగాంధీతో మెుదలు ఈరోజు సబిత వరకు అందరిపై నోటికి ఏదొస్తే అది సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందే ఆ పార్టీకి మేం సేవలందించాం. మహిళలపై గౌరవం లేదు.. ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడవద్దో రేవంత్ రెడ్డికి ఆలోచన లేదంటూ విమర్శించారు. 


అసెంబ్లీ నుంచి పారిపోయారు 


‌‌అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ రెడ్డి పారిపోయారు. భట్టి మాటలు బాధకలిగించాయని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్న సబితారెడ్డి. పార్టీ మారారని అనే హక్కు మీకు లేదన్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని సబిత స్పష్టం చేశారు.  మేము పార్టీ మారలేదు.. పార్టీ నుంచి బయటకు మెడ పట్టి గెంటేశారు. మా కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ ను పక్కకు దించేసినప్పుడు ఇంద్రారెడ్డి.. 2014లో టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి పనిచేశానన్నారు. నన్ను రాజకీయాల్లోకి రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారు. మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. కానీ ఈ రోజు సభలో మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అన్నారు.