Hyderabad Fire Accident | హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాద మరణాల పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని,మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.
భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపైన కేటీఆర్
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషాద ఘటన చాలా హృదయవిదారకంగా ఉంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ అగ్నిప్రమాదం త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తూ, ప్రార్థించారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు.
స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పాతబస్తీ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రమాదం జరిగిన తీరు, ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు తలసాని. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ప్రాణాలతో బయటపడ్డ నలుగురు
ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో భవనం మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే వంట గదిలోని ఎల్పీజీ సిలిండర్ పేలడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో మొత్తం 21 మంది వరకు ఉన్నారు. వారిలో నలుగురు ఇంటి మీదకు వెళ్లి అటు నుంచి పక్క బిల్డింగుకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ పీల్చి కొందరు, ఊరిరాడక కొందరు స్పృహ కోల్పోయారు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్ వారిని బయటకు తీసుకొచ్చి, అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు. కానీ అప్పటికే కొందరు చనిపోయగా, చికిత్స పొందుతూ మిగతా వారు చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది మృతిచెందారు.