Hyderabad Fire Accident Tragedy: హైదరాబాద్: హైదరాబాదులోని చార్మినార్ లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో చాలామంది చనిపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనలో చనిపోయిన మృతుల ఒక్కో కుటుంబానికి రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద కృష్ణ పెరల్స్ దుకాణం ఉన్న భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డిచార్మినార్ లోని గుల్జార్ హౌస్ లోని ఓ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. త్వరగా స్పందించి ఉంటే ప్రాణ నష్టం తగ్గేదన్నారు. అగ్నిమాపక సిబ్బందికి మెరుగైన శిక్షణతో పాటు మెరుగైన టెక్నాలజీ పరికరాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

గుల్జార్ హౌస్ ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం

హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 16 మంది దుర్మరణం చెందడంపై ఆవేదనకు లోనయ్యారు. బాధిత కుటుంబాలకి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను  అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.