Medchal News Today | దుండిగల్ : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లితో పాటు స్కూలుకు వెళ్తున్న బాలుడి మీద నుంచి టిప్పర్ వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ముందు మరో వాహనం అడ్డురావడంతో చివరి నిమిషంలో టిప్పర్ వీరి స్కూటిని ఢీకొట్టింది. వెనుక చక్రాలు బాలుడి మీద నుంచి వెళ్లడంతో చనిపోయాడు. 

మేడ్చల్ జిల్లా దుండిగల్ పియస్ పరిధిలోని మల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. 1వ తరగతి బాలుడు అభిమాన్షు రెడ్డి (6)ని తల్లి స్కూటీ మీద స్కూలుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలో మహిళ మరో వాహనాన్ని ఓవర్ టెక్ చేసే ప్రయత్నం చేయగా, మరో బైక్ అడ్డుఉండటంతో స్కూటీని స్లో చేశారు. ఇదే సమయంలో వీరి స్కూటీ అదుపుతప్పడం, టిప్పర్ లారీ సైతం ఢీకొట్టడం ఒకేసారి జరిగిపోయాయి. స్కూటీ నుంచి తల్లి, బాలుడు కిందపడిపోయారు. దురదృష్టవశాత్తూ టిప్పర్ లారీ బాలుడి మీద నుంచి వెళ్లిపోవడంతో దుర్మరణం చెందాడు.

బాలుడి మృతిని కళ్లారా చూసిన ఆ తల్లి కన్నపేగు తల్లడిల్లింది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అటూ ఆమె రోదించడం ఆ మార్గంలో వెళ్తున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. బాలుడు బౌరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడని పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరగడంతో కొంత సమయం అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.