భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఈయనతో పాటు మొత్తం 16 మంది నేతలు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తదితరుల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్యతోపాటు మరికొందరు లీడర్లు కూడా బీజేపీలో చేరారు. వారికి బీజేపీ నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీలో చేరిన తర్వాత బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గ ప్రజల మంచి కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లుగా చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో తాను కూడా పాలు పంచుకుంటానని అన్నారు. ఇక ప్రజల కోసం పని చేయడమే తన ప్రధాన కర్తవ్యం అని అన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు తెలంగాణకు వచ్చాయని అన్నారు. ప్రత్యేకంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తాను ఎంపీగా ఉన్న సమయంలో నిధులు తీసుకొచ్చానని అన్నారు. ‘‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్.. అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము ముందుకు వెళ్తామని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ పాత్ర
బూర నర్సయ్య గౌడ్ స్వయంగా డాక్టర్. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా పని చేశారు. అలా నర్సయ్య గౌడ్ 2013లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి భువనగిరి నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎంపీ హోదాలో స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ మెంబర్ గానూ పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేతిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఆశించారు. వేర్వేరు కారణాల వల్ల అది దక్కలేదు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ కూడా ఆశించారు. కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ కు టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరతారని ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్య గౌడ్ కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంలో తాను పోషించిన కీలక పాత్ర గురించి లేఖలో ప్రస్తావించారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆశించారు. కానీ, అది కూడా లేకపోవడంతోనే బూర కొన్నాళ్లుగా అసహనంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.