జూబ్లిహిల్స్ పబ్‌కు వెళ్లిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే నెక్లెస్ రోడ్డులో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరగడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకు సీఎం కేసీఆర్ చేతకాని పాలనే కారణమని బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు. 


హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు అడ్డాగా రాష్ట్రం.. 
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని... హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్ దందాకు అడ్డాగా మారింది. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి.. కేసీఆర్ పాలనలో తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో బలుపెక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ అత్యాచారాల అడ్డాగా మారింది. జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై టీఆర్ఎస్, మజ్లిస్ నాయకుల కుమారుల గ్యాంగ్ రేప్, దాష్టీకాలను మరువకముందే నెక్లెస్ రోడ్డులో మరో మైనర్ బాలికపై అత్యాచారం తాజాగా వెలుగు చూడటం అత్యంత బాధాకరం. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో మూర్చ వ్యాధిగ్రస్తుడైన అమాయకుడిపై పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమన్నారు.


అమాయకులు, పేదలపై పోలీసుల ప్రతాపం.. 
‘కేసీఆర్ పాలనలో చట్టాలంటే క్రిమినల్స్‌కు భయం లేకుండా పోయింది. మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయింది. అమాయకులపైనా, పేదలపైన ప్రతాపం చూపుతున్న పోలీసులు రాజకీయ పలుకుబడి, డబ్బున్న వాళ్లను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తూ శాంతిభద్రతల సమస్యకు కారకులవడం సిగ్గు చేటు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అండ చూసుకుని పెట్రేగిపోతున్నారు. తామేం చేసినా చెల్లుతుందనే భావనతో అభం శుభం తెలియని బాలికలు, మహిళపై అత్యాచారాలకు, హత్యలకు ఒడిగడితున్నారని’ బీజేపీ నేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


టీఆర్ఎస్ పాలనలో మహిళలు, బాలికలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ నాయకులనో, మజ్లిస్ పార్టీ వాళ్లనో చూసీ చూడనట్లు వదిలేయడంవల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడింది. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని క్రిమినల్స్ ను  క్రిమినల్స్ గా చూసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Also Read: Congress On TRS: తెలంగాణ తరహా ఉద్యమానికి ఇదే సమయం- ప్రజలకు కాంగ్రెస్ నేతలు పిలుపు


Also Read: Telangana Bonalu Utsav : తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల నిర్వహణ, ఉత్సవాలకు రూ.15 కోట్లు మంజూరు - మంత్రి తలసాని శ్రీనివాస్