తెలంగాణ ఆదాయం, అప్పులు, ఖర్చులు, చెల్లిస్తున్న వడ్డీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం.. మరిన్ని అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ  సీనియర్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. వచ్చే 2023- 24 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపనుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని... మరో 50 వేల కోట్ల అప్పులకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందన్నారు. 


అప్పుల పుట్ట


రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం... ఆర్థిక వ్యవస్తను అతలాకుతలం చేసిందన్నారు భట్టి విక్రమార్క. అప్పులు దొరక్క, ఆదాయం రాక చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. స్థానిక సంస్థలకు పెండింగ్‌లో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 


నో బిల్స్‌


లోకల్‌ ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు భట్టి విక్రమార్క. ఐక్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పెండింగ్ బిల్లులు సాధన కోసం సర్పంచులు ఆందోళన బాట పట్టాలన్ని సూచించారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు వచ్చేంత వరకు అండగా నిలబడుతుంది వారు చేసి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. 


లా అండ్‌ ఆర్డర్స్‌ సమస్యలు


తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయంటున్నారు భట్టి విక్రమార్క. హైదరాబాద్‌లో బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తాజాగా మరో ఇద్దరు బాలికలు లైంగిక దాడికి గురైనట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. 


లిక్కర్ స్టేట్‌


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని చాలా మంది కలలు కన్నారని.. కేసీఆర్‌ మాత్రం లిక్కర్ తెలంగాణగా మార్చేశారాని విమర్శించారు మధుయాష్కి. తాగుడు అలవాటును రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారన్నారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లానీళ్లు రావు కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు.  


టార్గెట్‌ పెట్టి మద్యం అమ్మకాల చేయడం వల్ల అబ్కారీ శాఖకు ఆదాయం వస్తున్నా.. ప్రజల సంసారాలు వీధి పాలు అవుతున్నాయన్నారు మధుయాష్కీ. మద్యం మత్తులో పెరుగుతున్న క్రైమ్ రేట్‌కు అంతులేకుండా పోతోందన్నారు. మద్యం మత్తులో జరుగుతున్న నేరాలకు ఘోరాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 


2014కు నేటికీ తేడా ఇదే


ఉమ్మడి రాష్ట్రంలో 30 పబ్బులంటే ఇప్పుడు వాటి సంఖ్య 100 దాటిందని గుర్తు చేశారు మధుయాష్కీ. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2,216 వైన్స్ ఉండగా.. వాటి సంఖ్య ఇప్పుడు 2620కి చేరిందన్నారు. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 1060 బార్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 1219కి పెరిగిందని వివరించారు. ఊరికి ఐదారు బెల్టుషాపులు పెట్టి రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా మార్చారన్నారు. 


కేవలం మద్యంపైనే ప్రభుత్వం నెలకు రూ. 2500 కోట్ల నుంచి రూ.3000 వేల కోట్ల వరకూ కొల్లగొడుతున్నారన్నారు మధుయాష్కీ. తెలంగాణ వచ్చిన కొత్తల్లో అంటే 2014-15లో మద్యం ఆదాయం రూ.10,880 కోట్లు ఉండగా, 2018లో రూ.20 వేల కోట్లకు చేరిందన్నారు. 2020కి వచ్చేనాటికి ఇది రూ.26 వేల కోట్లు అయితే.. 2021లో రూ. 31 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ ఏడాది కనీసం రూ.40 వేల కోట్లను కొల్లగొట్టే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. 


మద్యం మత్తులో హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో కన్న కూతురిపైనే లైంగిక దాడి చేశారని తెలిపారు మధుయాష్కి. నల్గొండ జిల్లా ముషంపల్లి మద్యం మత్తులో యువకులు రోడ్డుపై మహిళపై హత్యాచారం.. హైదరాబాద్‌లోని అంబర్ పేటలో మల్లమ్మ అనే మహిళను తాగుబోతులు కారును రాష్ డ్రైవింగ్ చేస్తూ పొట్టన పెట్టుకున్నారన్నారు. ఈ ఏడాది మార్చిలో మేడ్చల్ జిల్లాలో మద్యం తాగి రాష్ డ్రైవింగ్ .. యాక్సిడెంట్ ఘటనలో ఇద్దరు మరణం.. మరో ఏడుగురు తీవ్రగాయాలయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చిలో బోధన్ ఎమ్మెల్యే స్టికర్ ఉన్న కారు నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ కారణంగా రెండేళ్ల చిన్నారి మరణం... తాజాగా మైనర్‌పై సామూహిక అత్యాచారం మద్యం వల్ల జరుగుతున్న నేరాలకు ఘోరాలకు నిదర్శనమన్నారు. 


ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని నేరాలకు, ఘోరాలకు మద్యం ప్రధాన కారణంగా మారుతోందన్నారు మధుయాష్కి. ఈ ఆరాచకాలకు అడ్డుకట్టు వేసేందుకు సంపూర్ణ మద్యపాన నిషేధమే మార్గమని సూచించారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటాలు మొదలవ్వాలన్నారు.