తెలంగాణ సీఎం కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని, కేవలం కొద్ది మంది (MIM) మెప్పు కోసం ప్రజలను వేదిస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అధికారం ఎల్లకాలం ఉండదు.. అనేకమంది కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజల ఉసురు పోసుకున్న వారు ఎక్కువ కాలం ఉండరన్న ఆయన.. బొడుప్పల్ బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ భూములు పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో బోడుప్పల్ బాధితులు ఇందిరాపార్క్ వద్ద చేస్తున్న  ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై మద్దతు తెలిపారు. 


ఈటల రాజేందర్ మాట్లాడతూ... ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసి కేసీఆర్ ప్రభుత్వం హింసిస్తుందని ఆరోపించారు. చాలా మంది బాధితులు తన దగ్గరికి వస్తే.. ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేకి మీ సమస్యను సీఎం కేసీఆర్ కు చెప్పే దమ్ము లేదని.. రోడ్డు ఎక్కితే తప్ప మీ కష్టాలు తీరవని సూచించినట్లు గుర్తుచేశారు. ఏనాడూ బయటికి వెళ్ళని వారు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి సోయి ఉండాలన్నారు.


ఇది తుగ్లక్ పాలన కాక ఇంకేంటి !
ప్రగతి భవన్, ఫామ్ హౌస్ ల నుంచి బయటికి రాని సీఎం కేసీఆర్.. ఎవరో అడిగారు అని మీరు ఇచ్చిన ఒక ఆదేశం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తున్నాయో చూస్తున్నారా లేదా ? మీకు జ్ఞానం ఉందా?. ఇది తుగ్లక్ పాలన కాక ఇంకేంటి అంటూ ఈటల మండిపడ్డారు. ఎల్బీ నగర్ లో కూడా ఇలాంటి సమస్య వస్తే మునుగోడు ఎన్నికల కోసం వారి భూములు అమ్ముకోవడానికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి జీఓ ఇచ్చి వచ్చారని గుర్తుచేశారు. అంటే ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళకి మనుషులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. 


ఫ్యూజ్ పీకేస్తే కేసీఆర్ ఇంటికే ! 
నేను డిమాండ్ చేస్తున్నట్లు ఇది 300 ఎకరాలకు సంబందించిన సమస్య కాదు.. ఈ 500 మంది ఆక్రందనలకు తెలంగాణ సమాజం అంతా స్పందిస్తుంది. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలందరి మద్దతు మీకు రావాలి. ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కేసీఆర్ కు అధికారం ఇచ్చింది 2023 వరకే.. సీఎం పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలు అనే విషయం మర్చిపోవద్దు. నీ కుర్చీ అధికారం మా ప్రజల చేతుల్లో ఉందని.. ఓటర్లు మీ ఫ్యూజ్ పీకేస్తే ఇంటికి పోతారంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


వక్ఫ్ భూమి అని చట్టం నిర్ణయిస్తే వారికి ఎక్కడన్నా భూమి కేటాయించండి. చట్టప్రకారం జాగాలు కొనుక్కుని, ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టొద్దు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. చట్ట ప్రకారం కోనుకున్న భూముల మీద మీ దౌర్జన్యం ఏంది? మేము కొనుకున్న భూముల మీద అధికారం చెలాయించడానికి నువ్వు ఎవరు అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎలాంటి బేషజాలకు, అహంకారానికి వెంటనే స్పందించి సీఎం కేసీఆర్ ఈ సమస్యపై మంచి నిర్ణయం తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు.