నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విచారణ కమిటీ రిపోర్టును ఇచ్చింది. ఆ కాలేజీలో సాత్విక్‌ అడ్మిషన్‌ లేదని ప్రాథమిక నివేదికలో కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌, మరో కాలేజీలో క్లాసులు జరుపుతున్నారని అని రిపోర్టులో స్పష్టం చేసింది. వేరే కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ ఉన్నా కూడా నార్సింగి కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. అన్ని కార్పొరేట్‌ కాలేజీల్లోనూ ఇదే వ్యవహారం నడుస్తోందని విచారణ కమిటీ వెల్లడించింది. క్లాసులు శ్రీచైతన్య కాలేజీలో పెడుతూ చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్ల విషయంపై అన్ని కాలేజీల్లో చెక్‌ చేయాలని కమిటీ సూచించింది. ర్యాగింగ్‌ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ తెలిపింది. విద్యార్ధుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.


శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫిబ్రవరి 28వ తేదీన అతను తరగతి గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో సిబ్బంది అయిన కృష్ణారెడ్డి, రవి, ఆచార్య, నవీన్ వంటి వారు బాగా ఒత్తిడికి గురి చేసినట్లుగా సాత్విక్ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నలుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఈ ఘటనపై విచారణ కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిత్తల్ నేతృత్వంలో కమిటీ ఐదు రోజుల పాటు విచారణ చేసింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.


నివేదిక తప్పుల తడక!


అయితే, ఈ విచారణలో ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యపై వివరాలను నివేదిక రూపంలో తప్పుల తడకగా అందించారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో​ రాశారు. ఈ నేపథ్యంలో రిపోర్టు తయారు చేసిన, రాసిన అధికారులపై సాత్విక్‌ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్‌ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. 


ఈ విషయంపై కూడా సాత్విక్‌ తల్లిదండ్రులు స్పందించారు. తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీ చైతన్య కాలేజ్‌ పేరు మీదనే అడ్మిషన్‌ తీసుకున్నామని తెలిపారు. శ్రీ చైతన్య కాలేజీ నార్సింగి క్యాంపస్‌లోనే సాత్విక్‌ను ఉంచుతామని, అదే కాలేజీలో క్లాసులు చెప్తామని కాలేజీ వారు చెప్పినట్లుగా తండ్రి చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్‌ ఉన్నట్టు తమకు తెలియదని వివరించారు. కాలేజీ యాజమాన్యమే తమ కొడుకును చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.