హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. మొదట ఎంపీలు ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసులో ఉన్నారు. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు తెరమీదకు వచ్చింది. బీజేపీ అధిష్టానం సైతం రామచందర్ రావు వైపు మొగ్గు చూపింది. బీసీలకు ఆ పదవి ఇవ్వాలంటే ఈటల రాజేందర్ కు ఇస్తారని గట్టిగానే ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అంచనాలు తలకిందులయ్యాయి. సోమవారం ఉదయం బీజేపీ అధిష్టానం నుంచి రామచందర్ రావుకు ఫోన్ కాల్ వచ్చింది. నామినేషన్ వేయాలి అనేది ఆ కాల్ సారాంశం. బీజేపీ అధిష్టానం నిర్ణయించిన నేత రామచందర్ రావు నేటి మధ్యాహ్నం రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆరెస్సెస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు రామచందర్ రావు పేరును ప్రతిపాదించడంతో అధిష్టానం ఆయనను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ నాశనం అవుతుంది.. రాజా సింగ్ వార్నింగ్

 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే బీజేపీకే తీవ్ర నష్టం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలి’’ అని రాజాసింగ్‌ ఘాటుగా స్పందించారు.