హైదరాబాద్: టీవీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతికేసులో నిందితుడు పూర్ణ చందర్‌ భార్య స్వప్న స్పందించారు. తన భర్త నిర్దోషి, అమాయకుడు అని చెప్పారు. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్న స్వప్న,  వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మొదట్లో తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణచందర్ ను తాను వదిలేశానని భార్య స్వప్న తెలిపారు.

పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదుయాంకర్ స్వేచ్ఛ చనిపోవడంతో ఆమె కూతురు నా భర్తను పూర్ణచందర్‌ పై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు స్వప్న. స్వేచ్ఛ మొదటి భర్త కూతుర్ని పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్‌ చేసింది. నా పిల్లలతో పాటు స్వేచ్ఛ కూతుర్ని స్కూల్లో జాయిన్ చేపించి ఫీజులు కూడా కట్టాడు. స్వేచ్ఛ కూతురు నా భర్తపై దారుణమైన నిందలు వేసింది. నా పిల్లలను ఎలా చూసుకున్నాడో, ఆ అమ్మాయికి కూడా బట్టలు ఇప్పించేవాడు. సొంత కూతురిలా చూసుకున్న వ్యక్తిపై అసభ్యకరమైన ఆరోపణలు చేయడం మంచిది కాదు. 

స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసింది. తనను అమ్మా అని పిలవాలని నా పిల్లలతో తరచుగా అనేది. ఓ అక్కతో ఆడుకోవాలని నాన్న చెప్పాడు, అక్కడ ఇంట్లో ఆంటీ కూడా ఉందని నా పిల్లలు చెప్పారు. తనను అమ్మా అని పిలవాలని ఆంటీ మాతో అన్నదని కూతురు చెప్పింది. మీ నాన్న వదిలి వెళ్లిపోతే నా భర్త మా కంటే బాగా మిమ్మల్ని చూసుకున్నాడు. ఇప్పుడు స్వేచ్ఛ కూతురు తండ్రిలాంటి తన భర్త పూర్ణచందర్ పై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుందనుకోలేదు’ అన్నారు. తన భర్త ఎలాంటి వాడో తెలుసునని, అదే సమయంలో కోర్టుల మీద తనకు నమ్మకం ఉందన్నారు స్వప్న.

స్వేచ్ఛకు మానసిక సమస్యలు.. ఆత్మహత్యకు నేను కారణం కాదు‘స్వేచ్ఛ తనకు 2009లో పరిచయం అయిందని, ఒకేచోట పనిచేసే సమయంలో ఫ్రెండ్స్ అయ్యామంటూ పూర్ణచందర్ పలు విషయాలను ఓ లేఖలో పేర్కొన్నారు. పూర్ణ పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేసేవారు. ఆమెను అన్నావదినల వద్ద వదిలేసి చుట్టాల్లాగ వచ్చి చూసి వెళ్లేవారు. ఈ విషయాన్ని చాలాసార్లు స్వేచ్ఛ నాతో చెప్పి బాధపడింది. ఆమె మానసిక సమస్యలు ఎదుర్కోంటోంది. అందుకుగానూ చికిత్స తీసుకుంటున్నట్లు నా వద్ద ఆధారాలున్నాయి.. ఆమె ఆత్మహత్యతో నాకు సంబంధం లేదంటూ’ నిందితుడు పూర్ణచంద్ర నాయక్ లేఖలో పేర్కొన్నారు.

కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కూతురితో సహజీవనం చేసి మోసం చేశాడని స్వేచ్ఛ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అరుణాచలం వెళ్లిన సమయంలో పెళ్లి ప్రస్తావన వచ్చిందన్నారు. పెళ్లి చేసుకోకపోవడంతో తను తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు.  తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, అమ్మ ఉన్న సమయంలో మంచి వాడిలా నటించేవాడని స్వేచ్ఛ కూతురు సైతం పోలీసులకు చెప్పడంతో నిందితుడు పూర్ణచందర్ పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.