Chemical Tanker Blast at Sigachi Chemicals in Hyderabad | హైదరాబాద్: పటాన్ చెరులోని ఓ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాశమైలారం లోని సీగాచి కెమికల్స్ కంపెనీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారని సమాచారం. పేలుడు ధాటికి షెడ్డూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తరువాత అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పాశమైలారంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. రియాక్టర్ పేలడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో కంపెనీలో ఎంత మంది ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.
పూర్తిగా కూలిపోయిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్
పేలుడు ధాటికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో పెద్దఎత్తున కార్మికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి ఆరుగురిని మాత్రమే బయటకుతీసుకొచ్చాయి. మరోవైపు హైడ్రా, ఫైర్, పోలీస్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. హైడ్రా భారీ క్రేన్లను రప్పించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నిస్తోంది. సహాయక బృందాలు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 20 మందిని చందానగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో 18 మందిని ఇస్నాపూర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిసత్ున్నారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో కార్మికులు ప్రాణభయంతో కంపెనీలో నుంచి బయటికి పరుగులు పెట్టారు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసన వస్తోంది. ఘాటైన వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శిథిలాల కింద 15 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి రాకుండా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అసలే కెమికల్ ఫ్యాక్టరీ కావడం, అందులోనూ పేలుడుతో ఘాటైన వాయువులు లీకవుతున్నాయి. విష వాయువులు పీల్చితే మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉందని పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.