Hyderabad Drugs News: హైదరాబాద్ మల్నాడు కిచెన్ డ్రగ్స్ దందాలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసుశాఖ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతుంటే, కొందరు కేటుగాళ్లు ఖాకీ యూనిఫామ్ చాటున డ్రగ్స్ మాఫీయాగా మారి రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల కొడుకులుగా చెప్పుకుంటూ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీమ్ విచారణలో తాజాగా పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. మల్నాడు కిచెన్ ఓనర్ సూర్య , ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ్‌తో కలసి డ్రగ్స్ దందా నిర్వహించేవారని ఈగల్ టీమ్ విచారణలో తేలింది. వీరిద్దరూ తమ స్నేహితులు, బడాబులు పుత్రరత్నాలలతో కలసి హైదరాబాద్‌లో అనేక పబ్‌లను డ్రగ్స్ పెడ్లర్లుగా మారారని, నగరంలో కొన్ని పబ్‌లను సెలక్ట్ చేసుకుని ,వాటిలో డ్రగ్స్ తీసుకునేందుకు ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేసుకునేవారని ఈగల్ టీమ్ విచారణలో వెలుగుచూసింది. తాజాగా మూడు పబ్‌లకు నోటీసులు ఇవ్వడంతోపాటు వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్‌లను సీజ్ చేసి, ఓనర్లపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ములుగులోని ఓ ఫామ్ హౌస్ ను అడ్డగా చేసుకున్న సూర్య అండ్ గ్యాంగ్ నెలలో మూడు వారాలు ఇక్కడే పార్టీలు నిర్వహించేవారని, ఈ పార్టీలలో డ్రగ్స్ సేవించేందుకు నగరంలోని బడాబాబులు పుత్రరత్నాలను సైతం ఆహ్వానించేవారని ఈగల్ విచారణలో తేలింది. రాహుల్, సూర్య డగ్ర్ కోసం ఇటీవల కాలంలో అనేకమంది డ్రగ్స్ పెడ్లర్లను కలిసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. గోవా, ముంబాయి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేయడంలో మహిళలను వాడుకునేవారని తేలింది. మహిళలల చెప్పుల క్రింద డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేయించేవారని నిర్దారించారు. డ్రగ్స్ సరఫరా తరువాత పబ్ యజమానులతో డీల్ కుదుర్చుకుని, డ్రగ్స్ సేవించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఇప్పటికే మూడు పబ్ లను గుర్తించిన ఈగల్ టీమ్ మరో నాలుగు పబ్ ల ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందడంతో ఆయా పబ్ లలో తనిఖీలు చేపట్టి, పబ్ యజమానులను విచారిస్తోంది.
మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులను గుర్తించిన ఈగల్ టీమ్. ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలించింది. ఏఆర్ డీసీపీ కుమారుడు సంజీవరావు కొడుకు మోహన్ రావు సైతం డ్రగ్స్ కొనుగోలు చేసి ఈ కేసులో ప్రధాన నిందితుడు సూర్యకు ఇచ్చేవాడు. వీళ్లంతా కలసి రాహుల్ తేజ్ కు చెందిన ఫామ్ హౌస్ లో పలుమార్లు పార్టీలు చేసుకునే వారు. ఇలా సిద్దిపేట, వరంగల్, మోయినాబాద్ , చిలుకూరు వంటి ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించడంతోపాటు , ఈ పార్టీలకు నగరంలోని సంపన్న కుటుంబాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులను పిలినట్లుగా సమాాచారం. ఈ కేసులో ప్రధాన నిందితులంతా ఒకే కమ్యూనిటీ చెందినవారు. విదేశాలలో ఉన్నప్పుడు వీరికి డ్రగ్స్ అలవాటైంది. ఆ తరువాత విదేశాల నుంచి హైదరాబాద్ కు చేరుకున్న నిందితులు ఇక్కడ రెస్టారెంట్ లు, హోటల్స్ , పబ్ ల పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. 5గురు నైజీరియన్లను డ్రగ్స్ సరఫరాకు వాడుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ్ కు పీటీ వాారెంట్ జారీ చేశారు. ఇలా మల్నాడు కిచెన్ డ్రగ్స్ దందాలలో పోలీసు ఉన్నతాధికారుల వారసులే డ్రగ్స్ పెడ్లర్లుగా మారడం సంచలనంగా మారింది.