Praja Bhavan Accident Case : బీఆర్ఎస్ (Brs) మాజీ ఎమ్మెల్యే షకీల్ (Ex Mla Shakeel) కుమారుడు సాహిల్ కు ఊరట లభించింది. ప్రగతి భవన్ రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ ను అరెస్టు చేయవద్దని, పంజాగుట్ట పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న పంజాగుట్ట పోలీసుల ముందు లొంగిపోవాలని సూచించింది. కారు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
దుబాయి ఎందుకు పారిపోయాడన్న న్యాయస్థానం
ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సాహిల్ పేరును తొలగించాలని, అతని తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police)... నిర్లక్ష్యంగా కారు నడిపినందుకే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సాహిల్ తప్పు చేయకపోతే దుబాయికి పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతోనే దుబాయ్ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు వివరించారు.
కావాలనే సాహిల్ పేరు చేర్చారన్న న్యాయవాది
పంజాగుట్ట పోలీసులు కుట్రపూరితంగా సాహిల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతోనే...ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఆసిఫ్ భయపెట్టి...సాహిల్ పేరు చెప్పించారని, అతనిపై 15 కేసులు ఉన్నట్లు చూపించారని కోర్టుకు తెలిపారు.
డ్రైవర్ లొంగిపొమ్మని తప్పించుకునే యత్నం
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ ప్రజా భవన్ వద్ద డిసెంబర్ 23 అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. బీఎండబ్ల్యూ కారుతో బారికేడ్లను తొక్కుకుంటూ వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపోమని చెప్పి పంపించాడని ప్రచారం జరిగింది. స్థానికులను విచారించిన పోలీసులు... సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. మరో యువకుడిని పట్టుకున్నారు. అతడిని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు.టెస్టుల్లో ఆ వ్యక్తి మద్యం తాగలేదని పోలీసులు గుర్తించారు.
ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులు, యువతులు
కారు బీభత్సం సృష్టించిన ఘటనలో సోహెల్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు. కారు ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని, వారంతా కాలేజీ స్టూడెంట్స్ అని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంజాగుట్ట సీఐను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రమాదం తర్వాత సోహెల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు వచ్చి సోహెల్‌ను విడిపించుకొని వెళ్లారు. ఆ తర్వాత సోహెల్ దుబాయికి వెళ్లిపోయాడని సమాచారం. తాజాగా హైకోర్టును ఆశ్రయించడంతో సోహెల్ ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.