తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం అయింది. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగస్థులకు జీతాలివ్వలేని పరిస్థితి వస్తుంది. బంగారు తెలంగాణ అంటారు.. కానీ అప్పుల తెలంగాణగా మార్చారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారంగా మారింది. రూ.లక్షల కోట్లను పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాలు రెండింటింకే ప్రజలు రాష్ట్రాన్ని దత్తత ఇచ్చారు. వారే ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.’’ అని అన్నారు.


సెక్రటేరియట్‌లో ఆఫీసులు ఎక్కడున్నాయో సీఎంకు తెలుసా?
‘‘తెలంగాణలో సెక్రెటేరియట్‌లో ఉన్న వివిధ శాఖల ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు తెలుసా? ఆ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన చెప్పాలని నేను సవాలు చేస్తున్నా.. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా సెక్రటేరియట్‌కి వెళ్లని ముఖ్యమంత్రిని మీరెక్కడైనా చూశారా? రాష్ట్రంలో ఒక నీతిమంతమైన పాలన రావాల్సిన అవసరం ఉంది.’’ అని కిషన్ రెడ్డి మాట్లాడారు.


ఈ యాత్రతో రాజకీయ ప్రకంపనలు..: బండి సంజయ్
అనంతరం బండి సంజయ్ ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. ‘‘ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకో మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర. ఈ యాత్ర మీ సహకారంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపబోతోంది. ఈ పాదయాత్ర చేస్తుంటే నన్ను విమర్శిస్తున్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతో మంది బలయ్యారు. కానీ, ఆ బలైన వారి ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణలో ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని అమరవీరుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. రైతుల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉంది.  ఏ రైతుకి మద్దతు ధర విషయంలో గ్యారంటీ ఇవ్వట్లేదు. 


పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలేదని వాళ్లు భయపడుతున్నరట. ఇది మరీ విడ్డూరం. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి ఆ మాట మర్చిపోయారు. అప్పటిదాకా నిరుద్యోగ సాయం అందిస్తానని చెప్పాడు. ఇప్పటిదాకా దాని ఊసే లేదు. ఒక్కొక్క నిరుద్యోగికి దాదాపు రూ.లక్ష బాకీ ఉన్నాడు.. కేసీఆర్. నోటిఫికేషన్లు అసలు ఇవ్వడం లేదు. టీఎస్పీఎస్సీలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయి ఉన్నారు. చదువుకున్నవారు కూలీనాలీ చేసుకునే పరిస్థితి నెలకొని ఉంది.’’


ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు
‘‘ఉద్యమం సమయంలో ఉద్యమాల కోసం ఆత్మహత్య చేసుకుంటే.. రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రగతి భవన్‌‌ను అందంగా కట్టుకొని సేద తీరుతున్న ముఖ్యమంత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని కట్టడం మర్చిపోయారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు బయటికి వచ్చి.. తర్వాత మళ్లీ ఫాంహౌస్‌కు పోతున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటున్నది బీజేపీ నాయకులు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు బీజేపీ నాయకులే అంతా తిరిగి సాయం చేశారు. అందుకే ఎల్బీ నగర్‌లో 12 మందిలో 11 మంది కార్పొరేటర్లు గెలిచారు.’’


బీజేపీ మతతత్వ పార్టీనే..
‘‘భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడుతుంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటున్నారు. కచ్చితంగా బీజేపీ హిందువుల కోసమే ఉంది. హిందూ సమాజాన్ని ధర్మాన్ని కాపాడేందుకు బీజేపీ పని చేస్తోంది. తెలంగాణలో ప్రతి హిందువు గర్వంగా చెప్పుకొనే పరిస్థితి తీసుకొస్తాం. ఎవడి అడ్డా భాగ్యలక్ష్మీ దేవాలయం? పాత బస్తీ మాది. తెలంగాణ మాది. ఏ బస్తీకైనా, ఏగల్లీకైనా వస్తాం. మా చేతిలో ఉన్నది కాషాయ జెండా. తాలిబన్ భావజాలం ఉన్న ఎంఐఎం పార్టీని, దానికి సహకరిస్తున్న ఎవరినైనా ఈ తెలంగాణ నుంచి తరిమితరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యం. తాలిబన్ భావజాలం ఉన్న తెలంగాణ కావాలా? బీజేపీ కావాలా? మీరే నిర్ణయించుకోండి’’ అని బండి సంజయ్ ఉద్రేకపూరితంగా మాట్లాడారు.