Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ స్పందించారు. కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం అని సెటైర్లు వేశారు. వారి  కృషి చివరికి ఫలించిందని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్ ద్వారా బయటకు వస్తే.. కాంగ్రెస్ నేత తెలంగాణ నుంచి రాజ్యసభలోకి వెళ్తున్నారని విమర్శించారు.


‘‘ప్రసిద్ధ మద్యం కుంభకోణంలో BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు - కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈ క్విడ్ ప్రో కో నేరంలో పాలు పంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు. విలీనం మాట ముచ్చట పూర్తయింది.. ఇక "అప్పగింతలే" తరువాయి’’ అని బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.


బీఆర్ఎస్ కౌంటర్
మద్యం పాలసీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో 5 నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.


సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని 2 రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని, ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని అన్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.


కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దానితో సంబంధం ఉందని తెలుస్తున్నా, కోట్ల రూపాయలు అక్రమంగా అనుమానాస్పద ఖాతాల్లోకి మళ్లాయని ఆరోపణలు వస్తున్నా, ఇప్పటి వరకు ఈడీ చర్యలు తీసుకోక పోవడంతోనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తుందో అర్ధమవుతున్నదని విమర్శించారు.