కేంద్ర హోంమంత్రి అమిత్‌షా - ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయి చర్చించుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అమిత్ షాని కలవడంలో తప్పేంటని బండి సంజయ్ అన్నారు. ఈటల రాజేందర్ అమిత్‌షా భేటీపై ఎవరికి తోచినట్లుగా వారు అపార్థాలు చేసుకోవడం సరికాదని అన్నారు. నేషనల్ లీడర్స్ ను రాష్ట్ర నేతలు ఎవరైనా కలిసే స్వేచ్ఛ బీజేపీలో ఉందని అన్నారు. కేసీఆర్ తరహాలో కాకుండా బీజేపీలో ఎవరు ఎవర్నైనా కలిసే అవకాశం దొరుకుతుందని అన్నారు. సోమవారం బండి సంజయ్ హోటల్ నోవాటెల్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అవినీతి పాలనను గద్దెదించడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో దందాలన్నీ టీఆర్ఎస్ నేతలే చేస్తున్నారన్నారు.


జులై 2, 3న బీజేపీ కార్యవర్గ సమావేశాలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆ సమావేశాల కోసం 35 కమిటీలు వేశామని, వారందరికీ బాధ్యతలు అప్పగించామని వివరించారు.. వారి ఆధ్వర్యంలో సమావేశాల కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని అన్నారు. ఈ సమావేశాల్లో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు మరో 300 మంది పార్టీ నేతలు పాల్గొంటున్నారని అన్నారు.


కరోనా అనంతరం మొదటిసారిగా ప్రత్యక్షంగా హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా పాల్గొంటారని వివరించారు. అతి పెద్ద సమావేశాలు ఇక్కడ సమావేశాలు నిర్వహించడం కార్యకర్తలకు పెద్ద భరోసానిస్తుందని అన్నారు.


జులై 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు 10 లక్షల మందితో ప్రధాని మోదీ సభ ఉంటుందని వివరించారు. 34 వేల పోలింగ్ బూత్ ల నుంచి జన సమీకరణ చేస్తామని చెప్పారు. 50 వేల మంది కార్యకర్తల నుంచి నిధి సేకరించి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. ‘‘క్యాష్ రూపంలో ఎక్కడా బీజేపీ నిధి సేకరణ ఉండదు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే నిధుల సేకరణ ఉంటుంది’’ అని బండి సంజయ్ వివరించారు.


నోవాటెల్ హోటల్ వద్ద వేదిక పరిశీలన
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న వేదిక నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణాన్ని బండి సంజయ్‌ సోమవారం పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్‌ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలు తెలుసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుత పదవి కాలంలో జరుగుతున్న చివరి జాతీయ కార్యవర్గం సమావేశం ఇది. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి. సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఆయన నేతలతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమావేశానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.