తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం మీద చెయ్యి వేయాలని బండి సంజయ్ సవాలు విసిరారు. మేము భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటే మీకు నమాజ్ గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నించారు. మరి అంతకుమందు నుంచి నమాజ్ ఎందుకు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. చార్మినార్ వద్ద ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసలేందుకు ఈ వివాదమంటే..
చార్మినార్ పై భాగంలో మసీదు ఉందని, అందులో నమాజ్‌లు చేయడం కోసం కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టారు. ఇదే దీనికి మూలం అయింది. ఆ రషీద్ ఖాన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఇన్ని రోజులు చార్మినార్ దగ్గర నమాజ్ ఎందుకు గుర్తుకురాలేదని, తాము భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తిని గుర్తించి పూజలు చేసుకుంటుంటే మీకు నమాజ్ గుర్తుకువచ్చిందా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల సంతకాల సేకరణను ముస్లిం సమాజం కూడా హర్షించబోదని అన్నారు. చార్మినార్‌ను తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
పాతబస్తీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎంతో కాలంగా అధికారంలో ఉన్న ఎంఐఎం పార్టీ పాతబస్తీ వెనకబాటుతనానికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ.. న్యూ సిటీగా.. హైటెక్ సిటీగా ఎందుకు కాలేదని ప్రశ్నించారు. ఇక్కడ ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్ ఎందుకు రాలేదని, పాత బస్తీ ఉగ్రవాదులకు స్థావరంగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. ఓవైసీ కుటుంబం తమ ఆస్తులను పెంచుకోడానికి తప్ప, పాతబస్తీ అభివృద్ధి గురించి ఎన్నడూ ఆలోచించలేదని అన్నారు.