పీవో తెలంగాణ.. పిలావో తెలంగాణ, లిక్కర్ తెలంగాణ.. లీకర్ తెలంగాణ.. అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగుతున్న క్రీడలు ఇవేనని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఖేలో భారత్ - జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను బీజేపీ జాతీయ నేత హన్స్ రాజ్ గంగారామ్‌తో కలిసి హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్స్ లో బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘దేశ వ్యాప్తంగా ఒక వాతావరణం ఉంటే.. తెలంగాణలో వేరేలా ఉంటుంది. తెలంగాణలో క్రీడలకు గ్రౌండ్స్ లేవు. ఉంటే వాటిని బీఆర్ఎస్ వారు కబ్జాలు చేసుకుంటారు. ఆ భూముల్లో అధికారిక భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టుకుంటారు. తెలంగాణలో ఎక్కడా క్రీడలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. మోదీ ప్రభుత్వం క్రీడలకు రూ.3 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఒక్క పైసా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలన్నీ ఫామ్ హౌస్ లో పెగ్గులు వేయడం.. తెలంగాణ ప్రజలను మోసం చేయడం’’ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.


పోలింగ్ బూత్ అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్


మరోవైపు, బండి సంజయ్ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘నిరుద్యోగ మార్చ్’ను దిగ్విజయం చేయాలని పిలుపు ఇచ్చారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు బండి సంజయ్ చెప్పారు.


కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భ్రుతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అధోగతి పాలవుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని అన్నారు.


‘‘ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. అందుకే ఉమ్మడి వరంగల్, మహబూబ్‌ నగర్ జిల్లాల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌ను విజయవంతం చేశారు. ఎల్లుండి (మే 11) సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేసి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీకి అడ్డా అని నిరూపించాలి. అందుకోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలంతా ఈ నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొనాలి. పోలింగ్ బూత్ సభ్యులంతా ఒక్కొక్కరు కనీసం వంద మందిని తీసుకురావాలి’’ అని బండి సంజయ్ పిలుపు ఇచ్చారు.