బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ వేళ మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నా కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపించారు. అందుకోసం మునుగోడు నియోజకవర్గానికి బుధవారం (నవంబరు 2) అర్ధరాత్రి బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, ఉద్రిక్తత జరిగింది. తొలుత మలక్‌పేట వద్ద అడ్డుకున్నారు. అయినా ఆయన ముందుకు వెళ్లడంతో వనస్థలిపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో కాన్వాయ్‌ ముందుకు వెళ్లింది. చివరికి బండి సంజయ్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు ఆపారు. దీంతో అర్ధరాత్రి వేళ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా ఆగిపోయాయి.


అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ని పోలీసు వాహనంలో తరలించారు. పోలీస్ కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు వెంబడించారు. అయితే, బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకు వెళుతున్నారో పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 


ముఖ్యమంత్రి వ్యవహారం, పోలీసుల, ఎన్నికల కమిషన్ తీరుపై నేడు ఉదయం బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలకు భయపడి టీఆర్ఎస్ దౌర్జన్యాలకు భయపడి నిన్న రాత్రి జరిగిన అరాచకాలకు సంబంధించిన వార్తలను కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం, ప్రచురణ చేయలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీడియా సంస్థలే సీఎం చెప్పు చేతల్లో ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు. కేసీఆర్ రాక్షస పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఖూనీ చేస్తున్నారని, రాక్షస పాలన అంతం కావాలంటే టీఆర్ఎస్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు.