అర్థరాత్రి హైడ్రామా అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్రగా టీఆర్‌ఎస్, సీపీఐ ఆరోపిస్తోంది. ఓటమి ఖాయమని గ్రహించిన బీజేపీ లీడర్లు ఉపఎన్నిక రద్దు చేసే కుట్రకు తెర తీశారని ఆక్షేపిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ధ్వజమెత్తుతున్నారు.
మునుగోడు ఉపఎన్నిక రద్దు చేసేందుకు బీజేపీ నేతల కుట్ర పన్నారంటూ ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అర్ధరాత్రి ధర్నాలతో మునుగోడు ఉపఎన్నిక రద్దు చేయించేందుకు బీజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నానికి పూనుకున్నారని ఆక్షేపించారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో ఘర్షణలను సృష్టిస్తోందన్నారు.
బీజేపీ తాను వేసుకున్న పథకం ప్రకారమే... పలివేలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్‌తో సహా టీఆరెస్ కార్యకర్తలపై గుండాగిరి చేసిందన్నారు కూనంనేని. అంకిరెడ్డిపాలెంలో జనం, విలేకర్లపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారని ఆరోపించారు. దాడులు కూడా చేశారన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మునుగోడులో బీజేపీ నేతలు ధర్నాల పేరుతో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నాయకులు ఇంత హైడ్రామా సృష్టిస్తుంటే.. ఎన్నికల కమిషన్, కేంద్ర పరిశీలకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కూనంనేని. తక్షణమే బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసీ మునుగోడు ఉపఎన్నిక శాంతియుతంగా జరిపించాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.
మునుగోడులో ఓటమి ఖాయమైపోయిందని గ్రహించిన బీజేపీ కొత్త డ్రామాలకు తెరతీసిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అపారంగా ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మునుగోడు నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. మునుగోడులో గెలవలేక... ఓటమి భయంతో దింపుడు కళ్లెం ఆశలతో రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజగోపాల్ రెడ్డి తాపత్రయమంతా సానుభూతి పొందేందుకేనన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన ధర్నా కార్యక్రమంతో పోలీసులతో బలవంతంగా అరెస్టు చేపించుకొని సానుభూతి పొందే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డిదని విమర్శించారు.