తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2' సినిమాకు అద్భుత స్పందన లభించింది. మన దగ్గర స్టార్ హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు ఎటువంటి స్పందన లభిస్తుందో? ఎర్లీ మార్నింగ్ షోస్ చూడటానికి అభిమానులు ఏ విధంగా అయితే ఎగబడి మరీ వెళతారో? ఆ విధంగా థియేటర్ల దగ్గర జన సందోహం కనిపించింది. 


ఎర్లీ మార్నింగ్ షోస్ ఫుల్!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 'అవతార్ 2' ఎర్లీ మార్నింగ్ షోస్ వేశారు. కొన్ని థియేటర్లలో ఉదయం ఏడు గంటలకు షో పడింది. మరి కొన్ని థియేటర్లలో ఏడు గంటల 30 నిమిషాలకు, 8 గంటలకు షోలు పడ్డాయి. వాళ్ళకు రెండు ఇంటర్వెల్స్ వచ్చాయి. అవునా? అంటే... 'అవును! నిజమే!' అని చెప్పాలి. సినిమా టీమ్ రెండు ఇంటర్వెల్స్ ఇవ్వలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రెండు ఇంటర్వెల్స్ వచ్చాయి. 


మహేష్ బాబు ఏఎంబీలో... 
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా ఉన్న గచ్చిబౌలి ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) మల్టీప్లెక్స్‌లో ఉదయం ఏడున్నర గంటలకు షో పడింది. ఇంటర్వెల్ తర్వాత అందరూ సీట్లలో కూర్చున్నారు. మళ్ళీ సినిమా మొదలైంది. ట్విస్ట్ ఏంటంటే... ఆల్రెడీ చూసిన సన్నివేశాలు స్క్రీన్ మీద వస్తున్నాయి. ఇంటర్వెల్ ఎక్కడ అయితే ఇచ్చారో దానికి పది పదిహేను నిమిషాల ముందు సీన్లు పడ్డాయి. జనాలు గోల పెట్టడంతో మళ్ళీ ఇంటర్వెల్ ఇచ్చి సినిమా వేశారు.


కూకట్‌పల్లి నిజాంపేటలోని జీపీఆర్ మల్టీప్లెక్స్‌లో అయితే మరీ దారుణం. ఇంగ్లీష్ సినిమా మధ్యలో తెలుగు వెర్షన్ సీన్ ఒకటి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత, ఎక్కడ ముగిసిందో? అక్కడి నుంచి కాకుండా కొంచెం ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేశారు. ఆశ్చర్యంగా తెలుగు వెర్షన్ పడింది. మళ్ళీ బ్రేక్ ఇచ్చి అప్పుడు ముందు నుంచి వేశారు. ఈ విధమైన ఎక్స్‌పీరియన్స్ మరికొన్ని థియేటర్లలో ప్రేక్షకులకు ఎదురైందని టాక్. అసలే, మూడు గంటల 12 నిమిషాల సినిమా. నిడివి ఎక్కువ అని సినిమా మొదలైన తర్వాత నుంచి బాధ పడుతున్న ప్రేక్షకులకు... డబుల్ ఇంటర్వెల్స్ మరో షాక్ ఇచ్చాయి.  


Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?


ఇండియాలో 'అవతార్ 2' థియేటర్లలో కావడానికి ముందు సూపర్ హెచ్‌డి ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. ఫ్రీగా సినిమా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుని చూశారు. ఈ పైరసీకి తోడు నెగిటివ్ రివ్యూలు రావడం 'అవతార్ 2'కు మైనస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియన్ రివ్యూ రైటర్స్ నుంచి కూడా సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. 


అవసరాల మాటల్లో 'అవతార్ 2'
అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కథానాయకుడు మాత్రమే కాదు... హీరో కంటే ముందు ఆయనలో రచయిత ఉన్నాడు. తెలుగు భాషా ప్రేమికుడు ఉన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే చాలు... అవసరాల తెలుగు ఎంత స్పష్టంగా, డైలాగులు ఎంత సూటిగా ఉంటాయో ఉంటుందో తెలుస్తుంది. అందుకే, ఆయన్ను ఎంపిక చేసుకున్నారేమో!? 'అవతార్ 2'కి ఆయనతో డైలాగులు రాయించారు.