సంగారెడ్డి: తెలంగాణలో ఉగ్రమూలాలు ఉండటం కలకలం రేపుతోంది. సంగారెడ్డి నుంచి ఓ వ్యక్తి పాకిస్థాన్ కు పకడ్బందీగా సమాచారాలు చేరవేస్తున్నాడు. అస్సాం పోలీసులు మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ సిమ్ కార్డులను నిందితులు సైబర్ క్రైమ్స్‌తో పాటు యాంటీ నేషనల్ ఆపరేషన్లకు వినియోగించారని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల జ్యోతి అనే హర్యానాకు చెందిన యూట్యూబర్ దేశ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసిందన్న కేసులో అరెస్ట్ చేశారు. ఆమెకు పాక్‌తో ఉన్న మరిన్ని లింకుల గురించి తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ రాకెట్ కేసును అస్సాం పోలీసులు ఛేదించారు. మన దేశానికి చెందిన సిమ్ కార్డులతో OTPలు చెప్పి పాకిస్తాన్‌లో వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు భారత్‌కు సంబంధించిన పక్కా సమాచారాన్ని పాక్ లోని కొందరు ఏజెంట్లకు చేరవేస్తున్నారని NIA దగ్గర కీలక సమాచారం ఉంది. అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో ఒకరు సంగారెడ్డిలో ఉంటున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఉంటున్న మోఫిజుల్ ఇస్లాం పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు.
కేంద్ర ఇంటలిజెన్సీ బలగాల హెచ్చరికతో అప్రమత్తమైన అస్సాం పోలీసులు మొత్తం ఏడుగురు సిమ్ రాకెట్ నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇస్లాం అనే వ్యక్తి అస్సాం నుంచి వచ్చి సంగారెడ్డిలో కూలీ మేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడున్న యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయడం, ఫేక్ సిమ్ కార్డులు క్రియేట్ చేసి పాకిస్తాన్ ఏజెంట్లకు పక్కా సమాచారం ఇవ్వడం ఇస్లాం పనిగా పెట్టుకున్నాడు.
అస్సాంలో మొబైల్ షాపులో పనిచేసిన ఇస్లాం వేరే వ్యక్తుల గుర్తింపు కార్డులతో సిమ్ లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేవాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని గొల్లపల్లిలో ఉంటున్న నిందితుడు పాకిస్తాన్ వారికి సైతం సిమ్ లు విక్రయించడంతో పాటు దేశంలో ప్రస్తుత పరిస్థితిని, యుద్ధం సమయంలో మీడియాలో వచ్చిన సమాచారాన్ని పాక్ లోని వ్యక్తుల వాట్సాప్ గ్రూపులో చేరవేసేవాడు. నిందితులు దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నాచితకా పనులు చేసుకుంటూ, సామాన్యులుగా జీవనం సాగిస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించేవారు. తమపై అనుమానం రాకుండా పాక్‌కు దేశ సమాచారం చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తేలనున్నాయి. వీరితో పాటు ఇంకా ఎవరైనా పాక్ కోసం పనిచేశారా, వీరి ప్లాన్ ఏంటనేది అధికారుల తేల్చనున్నారు.