Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Sep 2022 05:46 PM
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా 

TS Assembly : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 11 గంటల బిజినెస్ జరిగింది. మొత్తం 28 మంది చర్చల్లో పాల్గొన్నారు. రెండు తీర్మానాలు చేశారు. ప్రభుత్వం ఎనిమిది బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించింది.  మూడు బిల్లులపై షార్ట్ డిస్కెషన్ జరిగింది.  

అమరావతి భూముల వ్యవహారంలో ఐదుగురు అరెస్టు 

AP News : ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ స్పీడ్ పెంటింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసింది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. 169.27 ఎకరాల వ్యవహారంలో సీఐడీ ఐదుగురిని తాజాగా అరెస్టు చేసింది. 

జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం, ఓ కార్పొరేట్ ఆఫీసులో చెలరేగిన మంటలు 

Hyderabad Fire Accident : హైదరాబాద్ నగరంలోని మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ఘటన మరువక ముందే జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36 వద్ద మరో అగ్ని ప్రమాదం జరిగింది. జూబ్లీ 800 పబ్ పక్కనే ఉన్న ఆఫీసులో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలంలో మంటలు అదుపుచేస్తున్నాయి. ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TDP leaders: కొడాలి నానిపై టీడీపీ నేత విమర్శలు

తెలుగు దేశం పార్టీ ఉంటే మంత్రి ప‌ద‌వి రాద‌నే కొడాలి నాని పార్టి మారి వైసీపీ పంచ‌న చేరారని టీడీపీ నేత య‌ల‌మంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ మండిప‌డ్డారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న త్రీ ఇడియ‌ట్స్ కు త్వ‌ర‌లోనే బుద్ది చెబుతామ‌ని హెచ్చ‌రించారు. కొడాలి నానితో పాటుగా వ‌ల్ల‌భ‌నేని వంశీ, దేవినేని అవినాష్ వంటి వైసీపీ నేత‌లు టీడీపీపై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్ర స్థాయిలో ఖండించారు. 

వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్

 


వీఆర్ఏలది అర్థం లేని ఆందోళన ఐతే.. మీది నరంలేని నాలుకనా కేసీఆర్!? 2020 సెప్టెంబర్ 9న ఇదే అసెంబ్లీలో వారికి పే స్కేల్ ఇస్తాం, పదోన్నతులు ఇస్తాం అని హామీ ఇచ్చింది మీరు కాదా! తాజాగా వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 



Eatala Rajender: ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి తరలించిన పోలీసులు

అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయగానే, ఆయన్ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుంచి తీసుకెళ్లారు. దీంతో వారి తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై ఆగ్రహించారు. ‘‘మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కుతున్నారు. గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను’’ అని ఈటల రాజేందర్ అన్నారు.

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తుందని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరునికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సకాలంలో వర్షాలు కురిసి, వాగులు, వంకలు పూర్తిగా నిండుకుండలా మారాయని అన్నారు. మనిషి నిత్య అవసరాలైన
సాగుకు మాత్రమే కాకుండా వన్య ప్రాణులకూ సైతం కడుపు నిండా మేత దొరుకుతుందన్నారు. అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తూ, అభివృద్ధి సంక్షేమంలో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని, సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వముఖాభివృద్ది సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.

KTR: ఆ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి - తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే తీర్మానాన్ని శాసనసభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరో 36 గంటల్లో ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, యానాంలలో వీచనున్నాయి. ఏపీ, తెలంగాణ, యానాంలలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
 
తెలంగాణలో వర్షాలు 
తెలంగాణలో సెప్టెంబర్ 14 వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిశాయి. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.
నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.  ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సైతం భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని నేడు సైతం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం ఏపీపై ఉన్నా, ఉత్తర కోస్తాంధ్ర వరకే పరిమితమైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మరో రెండు రోజులపాటు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్.టీ.ఆర్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడతాయి. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఇప్పటివరకూ కురిసిన వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో వరదతో కొన్నిచోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.