ఎవరు ఎన్ని చెప్పిన తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌(Congress) నేతలు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. మొన్నటి మొన్న అంతా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు చేశారు. అబ్బో అధిష్ఠానం క్లాస్ తర్వాత విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీకోసం కష్టపడుతున్నారులే అనుకునే లోపు మరో వివాదం చుట్టుముట్టింది. 


తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు మరో వివాదం అధిష్ఠానానికి, ఇటు రాష్ట్ర కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వంపై ప్రజాసమస్యల పై పోరాడాల్సిన లీడర్లు ఇప్పుడు తమలో తామే కుమ్మేసుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు అధిష్ఠానానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేస్తున్నారు. 


తాజాగా అద్దంకి దయాకర్‌(Addanki Dayakar) రాసిన లెటర్‌ కలకలం రేపుతోంది. నేతల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. తన ఓటమికి కారణమైన వారిని ప్రోత్సహిస్తూ పార్టీ ప్రగతికి అడ్డుపడుతున్నారన్నది ఆయన ఫిర్యాదు. నేరుగా ఆయన అధిష్ఠానానికి లేఖ రాయం సంచలనంగా మారింది. 


కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి(Uttama Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati Reddy  Venkata Reddy), దామోదర్‌ రెడ్డి(Damodar Reddy)పై సోనియా గాంధీ(Sonia Gandhi)కి లెటర్ రాశారు అద్దంకి దయాకర్. మీ ముగ్గురిపై ఆ లేఖలో సీరియస్ కామెంట్స్ చేశారు. తన ఓటమికి కారణమైన వ్యక్తులను ప్రోత్సహిస్తూ పార్టీని బలహీన పరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి చాలా ఇబ్బంది అంటూ ఫైర్ అయ్యారు. 


అద్దంకి దయాకర్ రాసిన లేఖ కాంగ్రెస్ సరికొత్త వివాదానికి దారి తీస్తోంది. ఇప్పటి వరకు సీనియర్ నేతలు పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు ఎదురు దిరిగి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వారిపైనే రేవంత్‌రెడ్డి వర్గం ఆరోపణలు చేస్తుండటంతో వివాదం మరో మలుపు తిరిగినట్టైంది. ఇప్పుడు అధిష్ఠానం ఏం చేయనుందో అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. 


ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు అధిష్ఠానం చాలా ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటికి మొన్న అందర్నీ దిల్లీకి పిలిచి క్లాస్ తీసుకున్నారు రాహుల్ గాంధీ. అంతా కలిసి ఐక్యంగా పార్టీని అధికారంలోకీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని తలంటి పంపించారు. అది జరిగి వారం రోజులుగడవక ముందే మరో వివాదం అధిష్ఠానం తలుపు తట్టింది. 


అద్దంకి దయాకర్‌ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు కొత్త కాదు. గతంలో కూడా బహిరంగ సభల్లోనే కాంగ్రెస్‌లోని కొందరి నాయకులపై ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీలో ఉంటూ టీఆర్‌ఎస్‌కు కోవర్టులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అప్పట్లోనే ఇది సంచలనంగా మారింది.