Ameerpet Fire Accident Metro Pillar 1043 Crack: హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట్ ప్రాంతంలో జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదం.. నగర రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. అమీర్‌పేట్‌లో మంటలు చెలరేగిన ఒక వాణిజ్య భవనానికి కేవలం అడుగు దూరంలోనే ఉన్న 1043 నంబర్ మెట్రో పిల్లర్ ఈ ప్రమాద తీవ్రతకు గురైంది. మంటల నుంచి వెలువడిన విపరీతమైన వేడి, అగ్ని సెగలు నేరుగా పిల్లర్‌కు తాకడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమైంది.
ఈ ప్రమాద తీవ్రత కారణంగా సదరు 1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు గుర్తించడంతో మెట్రో రైలు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణించే మెట్రో మార్గం కావడంతో.. పిల్లర్ అంతర్గత నిర్మాణానికి ఏమైనా నష్టం వాటిల్లిందా? భవిష్యత్తులో దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? అనే కోణంలో అధికారులు తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు.
పిల్లర్ నాణ్యత, భద్రతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు జేఎన్‌టీయూ కు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణుల బృందం అత్యవసరంగా రంగంలోకి దిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక డివైజ్‌లు, అల్ట్రాసోనిక్ టెస్టింగ్ పరికరాలను ఉపయోగించి నిపుణులు పిల్లర్ నాణ్యత, కాంక్రీట్ సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. మంటల వేడి వల్ల పిల్లర్ లోపలి ఇనుప చువ్వలు ఏమైనా బలహీనపడ్డాయా అనే కోణంలో లోతుగా తనిఖీలు చేపట్టారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు మెట్రో అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ మార్గంలో మెట్రో రైళ్ల వేగాన్ని తాత్కాలికంగా నియంత్రించడం లేదా నిశితంగా పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అమీర్‌పేట్ మెట్రో కారిడార్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ గ్రౌండ్ లెవెల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న జేఎన్‌టీయూ నిపుణుల బృందం అందించే తుది నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఒకవేళ పిల్లర్ నాణ్యత దెబ్బతిన్నట్లు నివేదికలో తేలితే.. దానికి ప్రత్యేక కెమికల్ గ్రౌటింగ్ చేయడం లేదా అదనపు జాకెటింగ్ వేసి పిల్లర్ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ఇంజనీరింగ్ విభాగం రెడీ అవుతోంది.
అగ్నిప్రమాదం కారణంగా తీవ్రనష్టం జరిగింది. పలు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
