Hyderabad Fire Accident: హైదరాబాద్ సిటీ నడిబొడ్డు అమీర్‌పేటలో మెయిన్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. అవి ఆర్పేలోపు మొత్తం ఆ బిల్డింగ్‌లో ఉన్న అని దుకాణాలకు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు కమ్ముకున్న పొగతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
బొమ్మల దుకాణం నుంచి..
బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న KSR ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణానికి అంటుకోవడంతోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. మొత్తం బిల్డింగ్ మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోయింది. భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం అగ్నిమాప సిబ్బంది భయపడిపోయారు.
20కిపైగా దుకాణాలు దగ్ధం.
బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేశాయి. మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలిబూడిద అయ్యింది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. వీటిలో 20కిపైగా షాపులు కాలిబూడిదైనట్టు తెలుస్తోంది. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి పరుగులు తీశారు.
భారీగా ట్రాఫిక్ జామ్
విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు. పొగ, మంటలు కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ మార్గాంలో వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
