MLA Akbaruddin Owaisi Gets Emotional: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచల వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని ప్రకటించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు యత్నించిన వారిని క్షమిస్తున్నానని ప్రజల సమక్షంలో ప్రకటిస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సలాలా బార్కాస్‌లో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చెందిన 11వ పాఠశాల భవనాన్ని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్దీన్.. క్షమించడం, విద్యను అందించడం లాంటి విషయాలు మనుషుల మధ్యను ప్రేమను పెంచి అంతా ఐక్యమత్యంగా చేసేందుకు దోహదం చేస్తాయన్నారు. 


తన కడుపులో కత్తులు దింపి, తనను నరికి హత్యాయత్నం చేసిన వారితో పాటు తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లిన వారిని కూడా క్షమిస్తున్నా అన్నారు. ఇదే సందర్బంగా ఎమ్మెల్యే బలాలకు జీవితకాలం రుణపడి ఉంటానని ఉద్వేగభరితంగా మాట్లాడారు. చావు బతుకుల మధ్య ఉన్న తనను ఎమ్మెల్యే బలాల బతికించారని చెప్పారు. అయితే తనపై హత్యాయత్నం జరిగి 12 ఏళ్లు గడిచిన తరువాత, ఇప్పుడు వారిని క్షమిస్తున్నానని ఎందుకు చెప్పారా అని హాట్ టాపిక్ అవుతోంది.


2011 లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై ప్రత్యర్గివర్గం హత్యకు ప్లాన్ చేసింది. ఆయన ప్రత్యర్థులు ముందుగా కత్తులతో దాడిచేసి అక్బరుద్దీన్ ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం నిందితులు కాల్పులు సైతం జరిపారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌ ఎదురుకాల్పులు చేయడంతో నిందితులు పరారయ్యారు. కానీ ప్రత్యర్థుల దాడిలో అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 15, 17 కత్తి పోట్లు ఉండగా... అక్బరుద్దీన్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకుపో యాయి. ఇప్పటికీ ఓ బుల్లెట్ ఆయన శరీరరంలోనే ఉంది. ఆ బుల్లెట్ బయటకు తీస్తే కొన్ని అవయవాలు పనితీరు ఆగిపోతుందన్న డాక్టర్ల సూచనతో అలాగే ఉంచేశారు.


అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్థానం, కెరీర్..
అక్బరుద్దీన్ ఒవైసీ 1970 జూన్ 14 లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, నాజిమా బేగం దంపతులకు జన్మించారు. హైదరాబాదులోనే చదువుకున్నారు. మెడిసిన్ మధ్యలోనే వదిలేసి రాజకీయాల పట్ల అడుగులు వేశారు. ఎంఐఎం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి 1999, 2004, 2009, 2014 సంవత్సరాలలో వరుసగా నాలుగు సార్లు హైదరాబాదు చాంద్రాయణ గుట్ట నుండి శాసన సభకు పోటీ చేసి గెలిచాడు. 2018లో ఎన్నికల్లోనూ విజయం సాధించిన అక్బరుద్దీన్ 22 సెప్టెంబర్ 2019 నుంచి తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు కమిటీ చైర్మన్‌ గా కొనసాగుతున్నారు.


వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్!
2012 డిసెంబర్ నెలలో లో ఆదిలాబాదు జిల్లా లోని నిర్మల్ పట్టణంలో ఓ మతాన్ని టార్గెట్ చేసి ఆయన చేసిన ప్రసంగం వివాదానికి దారితీసింది. దీనిపై ఐపీసీ 120- బీ (నేరపూరిత కుట్ర), 153 ఏ, 295 ఏ, 298 (ఏదైనా వ్యక్తి యొక్క మతపరమైన భావాలను భంగం కలిగేలా ఉద్దేశపూర్వక ప్రసంగం), 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి మాట్లాడవద్దని గత ఏడాది నాంపల్లి కోర్టు అక్బరుద్దీన్‌ను ఆదేశించింది. ఆయనపై ఉన్న పదేళ్ల నాటి రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial