Maharashtra Leaders Join BRS: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సమయంలోనే పలువురు నేతలు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రకు చెందిన నేతలు బీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొంతకాలం నుంచి మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 200 నుంచి 300 మంది నేతలు, కార్యకర్తలు పలువురు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారిని బీఆర్ఎస్ లోకి సాదర స్వాగతం పలికారు.


పుట్టిన గడ్డ తెలంగాణ అయితే పెంచిన తల్లి మహారాష్ట్ర అన్నారు ఓ నేత దశరథ్ . షోలాపూర్ లో చాలా వరకు తెలుగు వారు ఉంటారని చెప్పారు. మహారాష్ట్రలో బాంబే, షోలాపూర్, పుణే లాంటి నగరాలలో బీఆర్ఎస్ ట్రెండ్ మొదలైందన్నారు. కొన్ని నెలల కిందట మీతో సమావేశం అయినప్పుడు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గతంలో తన తండ్రి బీజేపీ తరఫున ఓసారి ఎమ్మెల్యే, 2 పర్యాయాలు ఎంపీగా చేశారని గుర్తుచేశారు దశరథ్. 4 నెలల కిందట నేను బీఆర్ఎస్ లో చేరతానని భావించలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి మారిపోయిందన్నారు. 


తన తండ్రి మహారాష్ట్ర నుంచి బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అని.. ఎన్నో ఏళ్లపాటు పార్టీ కోసం పనిచేశారని బీఆర్ఎస్ లో చేరిన నేత దశరథ్ తెలిపారు. ఎన్సీపీ నేతలను సైతం ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ తెలంగాణలో తీసుకొచ్చిన పథకాలు మహారాష్ట్రలో అమలు చేసే పరిస్థితి లేదన్నారు. వారం రోజులకు ఓసారి కొన్ని ప్రాంతాల్లో తాగునీళ్లు వస్తాయన్నారు. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఏర్పడి బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరినట్లు దశరథ్ పేర్కొన్నారు. ఎన్సీపీ తిరుగుబాటు వర్గం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సైతం స్వీకరించగా, మరో 8 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.



మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ నేతలు తిరుగుబాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ గుర్తుతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్ పవర్ ను గుర్తించాలని సైతం ఎన్సీపీ తిరుగుబాటు వర్గం ఎన్నికల కమిషన్ కు సైతం లేఖ రాసింది. ఏజ్ బార్ అయిపోయిందని, ఇంకెంత కాలం పదవులు అనుభవిస్తారు అంటూ శరద్ పవార్ పై సైతం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కొందరు ఎన్సీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూసి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. నేడు షోలాపూర్ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial