Dr Nageshwar Reddy on Covid: కరోనా తన రూపును మార్చుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కొత్తగా బీఎఫ్7 వేరియంట్ చైనాను వణికిస్తోంది. ఈ క్రమంలోనే మన దేశ ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బీఎఫ్7 ను దేశంలో అడుగు పెట్టనీయకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే బీఎఫ్7 వేరియంట్ కు అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదని ఏఐజీ ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్తగా వచ్చిన కొర్బి వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్ వచ్చే అవకాశం చాలా వరకు తక్కువని చెబుతున్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ ను బూస్టర్ డోస్ గా అందరూ తీసుకోవాలన్నారు. ముందు రెండు డోసులు కోవిషిల్డ్ లేదా కోవాక్సిన్ ఏది వేసుకున్నా బూస్టర్ డోసుగా ఈ కొర్బి వ్యాక్స్ ను తీసుకోవచ్చని చెప్పారు. ఈ వ్యాక్సిన్ కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వలన తక్కువ బాడీ పెయిన్స్, లైట్ ఫీవర్ ఉంటుందని వివరించారు.
"కరోనా ప్రభావం చైనాలో ఉన్నంతగా మన దేశంలో లేదు. ఇది అంత పెద్ద డేంజరస్ వైరస్ ఏం కాదు. కొర్బి వ్యాక్స్ తీసుకుంటే చాలా వరకు ఏం ప్రాబ్లం ఉండదు. మన దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్లను 80 శాతం మంది తీసుకున్నారు. బూస్టర్ డోస్ మాత్రం కేవలం 28 శాతం మందే తీసుకున్నారు. కాబట్టి బూస్టర్ డోసుగా కొర్బి వ్యాక్స్ తీసుకొమ్మని మేం చెప్తున్నాం. మొదటి బూస్టర్ డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత సెకండ్ డోస్ బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చు. 2 సంవత్సరాల పిల్లల నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొర్బివ్యాక్స్ వేసుకుంటే కొంచెం జ్వరం, లైట్ బాడీ పెయిన్స్ ఉంటయ్. గతంలో లాగా బీఎఫ్7 వేరియంట్ ఊపిరితిత్తుల్లోకి ఏం వెళ్లట్లేదు. కొత్త వేరియంట్ లక్షణాలు కూడా కొంచెం జ్వరం, గొంతు నొప్పి, జలుబు, లైట్ గా బాడీ పెయిన్స్ మాత్రమే ఉంటున్నాయి." - డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్
చైనాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఫెయిల్ అయింది కాబట్టే మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం బాగా జరిగిందని చెప్పారు. ఇప్పుడు వచ్చే కరోనా కొత్త వేరియంట్ కూడా ఫిబ్రవరి చివరి వరకు పోతుందని అన్నారు. కొర్బి వ్యాక్స్ ను బూస్టర్ డోసుగా అందరూ తీసుకోవాలన్నారు. భారతీయులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నారని.. కాబట్టి యాంటీ బాడీస్ ఉన్నాయని, ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉందన్నారు. బీఎఫ్7 వేరియంట్ అంత ప్రమాదం కాదని, ఇది ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్లడం లేదని వివరించారు. షుగర్ ఉన్న వారికి మాత్రం కొంత ప్రమాదం ఉందని, వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రెండు నెలలు ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు వాడాలని అన్నారు.